పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

అంతానికి ఆరంభం


చేస్తే క్షణంలో మిమ్మల్ని త్రోవకు తీసుకురాగలం కాని మీదంతా మరో పద్దతి మీరు దుఃఖం కలిగించే వారికి కూడా దు:ఖం కలిగించవద్దంటారు మీరు దుఃఖాలు, కష్టాలు స్వయంగా సహించి విజయం సాధించాలని చూస్తారు. శిష్టతను సభ్యతను వదలనే వదలరు. అందువల్ల మేము మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాం అని అన్నాడు

ఇలాంటి భావాలే జనరల్ స్మట్టు కూడా వెల్లడించారు

సత్యాగ్రహుల వినయం, సౌజన్యం వల్ల కలిగిన సత్పలితం యిది ఒక్కటే కాదని యింకా అనేకం వున్నాయని పాఠకులు గ్రహింతురుగాక. తెల్ల కార్మికులు సమ్మె చేస్తువిపరీతంగా చెరుకు పంటను నరికివేశారు. వాళ్లు నరికి వేసిన ఆ చెరుకును భారతీయులు మిల్లులకు చేరవేసియుండకపోతే తెల్లవాళ్లు విపరీతంగా నష్టపడిపోయే వాళ్లే ఆ చెరుకును మిల్లుకు చేర్చాలంటే 1200 మంది భారతీయ కార్మికులు తిరిగి పనిలో చేరవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసిన తరువాతనే మన వాళ్లు తిరిగి సమ్మెలో చేరారు. ఇదేగాక డర్బన్ మునిసిపాలిటీలో సమ్మె జరుగుతున్నప్పుడు పాకీ పని, అసుపత్రుల్లో పారిశుధ్యం పని చేయమని చెబితే సంతోషంగా వెళ్లి భారతీయులు చేశారు. పాకీ పని, ఆసుపత్రుల్లో పారిశుధ్యం పని మనవాళ్లు చేసి యుండకపోతే డర్బనులో రోగాలు వ్యాప్తమై, అంతా అస్తవ్యస్తమైపోయి వుండేది. సత్యాగ్రహులు అటువంటి పరిస్థితికి అవకాశం యివ్వలేదు కనుకనే అట్టి పనులచేసే వారికి సమ్మె చేయవద్దని చెప్పాము. సత్యాగ్రహి వేసే ప్రతి అడుగు వ్యతిరేకుల స్థితి గతులను గురించి యోచించి మరీ చేస్తూ వుండాలి.

భారతీయులు చూపించిన యీ సౌజన్యానికి సహృదయతకు సత్ఫలితాలు కలిగాయి. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఇట్టి సత్కార్యాల వల్ల భారతీయుల గౌరవప్రతిష్ఠలు పెరిగాయి. ఒడంబడికుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.