పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

అంతానికి ఆరంభం

జైలునుంచి విడుదల అయినందుకు మేము ముగ్గురము నిరాశ పడ్డాము బయట ఏమి జరిగిందో మాకు తెలియదు. కమీషన్ నియామకం గురించి తెలుసుకొని ఆశ్చర్యపడ్డాము యీ కమీషన్‌కు మసం సహాయమేమీ చేయలేము అని నిర్ణయానికి వచ్చాము. అయితే కమీషనులో ఒక భారతీయుణ్ణి మెంబరుగా నియమించడం అవసరమని భావించాము మేము ముగ్గురం డర్బను చేరాము. 1913 డిసెంబరు 21 వ తేదీన జనరల్ స్మట్సుకు మేము ఒక జాబు వ్రాశాము.

మీ కమీషనుకు స్వాగతం చెబుతున్నాం. కాని అందలి యిద్దరు సభ్యులు శ్రీ ఎస్లన్, శ్రీ వైలీ గారల నియుక్తి జరిగిన తీరును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వ్యక్తిగతంగా మాకు వారి యెడ వ్యతిరేకత లేదు. వారు సుప్రసిద్ధులు. యోగ్యులైన పౌరులు కాని వారిరువురు అనేక సార్లు భారతీయులకు వ్యతిరేకంగా తమ అభిప్రాయం వెల్లడించారు. అందువల్ల తెలిసో తెలియకయో వారు భారతీయులకు అన్యాయం చేసే ప్రమాదం వున్నది. ఏమనిషి హఠాత్తుగా తన స్వభావాన్ని మార్చుకోలేడు. అందువల్ల యీ యిద్దరు పెద్దమనుషులు హఠాత్తుగా తమ స్వభావం మార్చుకుంటారవి భావించడం ప్రకృతి నియమానికే విరుద్ధం అయినా వాళ్ళను తొలగించమని మేము కోరము. కమీషనులో తటస్థంగా వుండే సభ్యుల సంఖ్య పెరగాలని కోరుతున్నాం. అందుకుగాను మేము సర్‌జేమ్స్ రోజయినిజ్, ఆనరబుల్ డబ్ల్యు.పి. ష్రైనర్‌గారల పేర్లు సభ్యులుగా నియమించమని మీకు సూచిస్తున్నాం వీరిద్దరూ ప్రముఖులు. న్యాయ ప్రవృత్తిలో ప్రసిద్ధులు. మరో వినతి సత్యాగ్రహులనందరినీ తక్షణం విడుదల చేయండి. అలా మీరు చేయకపోతే మేము జైలు బైట వుండటం కష్టం. యింకా వాళ్ళందరినీ జైళ్లలో వుంచడానికి అర్థంలేదు. యింతేగాక కమీషన్ ఎదుట సాక్ష్యం యివ్వాలంటే మేము గనుల దగ్గర పని చేస్తున్న గిర్‌మిటియా కార్మికులనందరినీ కలవాలి. వారి అభిప్రాయం తెలుసుకోవాలి. అందుకు మాకు స్వాతంత్ర్యం లభించాలి. ప్రభుత్వం మా యీ ప్రార్థనను అంగీకరించకపోతే మేము తిరిగి జైలుకి వెళ్లుటకు చర్యలుగైకొనక తప్పదని విచారంతో తెలుపుతూ వున్నాము. యిదీ మా జూబు యందలి విషయం.