పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

కఠిన పరీక్ష


మంచం మీది నుంచి లేవలేని స్థితి. అయినా వారు దక్షిణాఫ్రికా వ్యవహారాలు స్వయంగా పరిశీలించి చర్యలుగైకొంటూ వుండే వారు. రాత్రి అనక, పగలనక వారు యీ విషయమై ఎంతో శ్రమించారు. తత్ఫలితంగా భారత దేశమంతా అట్టుడికినట్లు ఉడికి పోయింది. దక్షిణాఫ్రికా యందలి భారతీయుల ప్రశ్న భారతావనిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.

వైస్రాయి లార్డ్ హార్డింగ్ (డిశంబరు 1913) మద్రాసులో రెచ్చగొట్టే ప్రసంగం అప్పుడే చేశారు. ఆయన చేసిన ప్రసంగం ఇంగ్లాండులోను, దక్షిణాఫ్రికాలోను గొప్ప అలజడిని రేపింది. వైస్రాయి యితర అధినివేశ రాజ్యాలను గురించిగాని, బ్రిటిష్ సామ్రాజ్యంలో చేరిన యితర దేశాలను గురించిగాని విమర్శించుటకు వీలులేదు. అయినా లార్డ్ హార్డింగ్ యూనియన్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించడమే గాక దక్షిణాఫ్రికా యందలి భారత సత్యాగ్రహుల పక్షం వహించి గట్టిగా మాట్లాడారు. వారు చేస్తున్న సహాయ నిరాకరణోద్యమాన్ని గట్టిగా సముర్ధించారు. లార్డ్ హార్డింగ్ చూపిన యీ ధైర్య సాహసాన్ని ఇంగ్లాండులో కొందరు విమర్శించారు. అందుకు ఏ మాత్రం వెరవకుండా, తన వాదనయందలి ఔచిత్యాన్ని వివరిస్తూ తన విమర్శను సమర్థించుకున్నారు. వారు చూపిన యీ సాహసం వల్ల మంచి ప్రభావం ప్రపంచ ప్రజలపై పడింది.

నిర్బంధించబడిన, పౌరుషవంతులగు కార్మికులను వదిలి, ఒక్క క్షణం సేపు గనుల దగ్గరకు వెళ్లి నేటాలుకు చెందిన యితర ప్రదేశాల్ని చూద్దాం బొగ్గు గనులు నేటాలుకు ఉత్తర దిశన ఉన్నాయి. అయితే కార్మికులు పెద్ద సంఖ్యలో నైఋతి, వాయువ్య దిక్కుల్లో వున్నారు. వాయువ్యదిక్కున ఫినిక్సు, బెరూలం, టొంగాట్ మొదలగు కేంద్రాలు వున్నాయి. నైఋతి దిక్కున ఇపిపింగో, అమిర్జింటో మొదలగు కేంద్రాలు వున్నాయి. వాయువ్య దిక్కున వున్న భారతీయులతో నాకు సంబంధం ఏర్పడింది. వారిలో చాలా మంది కార్మికులు బోయర్ యుద్ధంలోనాతో బాటు పని చేశారు. నైఋతి దిక్కున వున్న కార్మికుల సమీపానికి నేను వెళ్ళి యుండలేదు. ఇక్కడ నా అనుచరులు లేరనే చెప్పవచ్చు. అయినా గనుల యందలి కార్మికుల