పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

345

రైళ్లలో కూర్చోపెట్టుకొని యాత్రా దళ సభ్యుల్ని షికారు కోసం కాక, అగ్నిలో కాల్చడానికే తెల్లప్రభుత్వం వాళ్లు తీసుకు వెళ్లారు. త్రోవలో వాళ్లకు తిండి లేదు. మంచినీళ్లు లేవు. నేటాలు చేరిన తరువాత కేసు బెట్టి వాళ్లను తిన్నగా జైలుకు తీసుకువెళ్లారు. అలా జరుగుతుందని మాకు తెలుసు. అలా జరగాలని మేము ఆశించాము కూడా. వేలాది మందిని జైల్లో వుంచడమంటే ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము కోరిందీ అదే. గనులు మూత పడతాయి. ఈ స్థితి ఎక్కువ కాలం సాగితే ప్రభుత్వం లొంగక తప్పదు. 3 పౌండ్ల పన్ను రద్దు చేయకతప్పదు. అందుకుగాను యూనియన్ ప్రభుత్వం కొత్త పన్నాగం పన్నింది. ఏ ఏ స్థానాల నుంచి గిర్‌మిటియా కార్మికులు పని మానుకొని వచ్చారో ఆయా చోట్లను ప్రభుత్వం జైళ్లుగా ప్రకటించింది. అందుకోసం క్రొత్త చట్టాన్ని చేసింది. ఆయా చోట్ల గనుల్లో పనిచేస్తున్న తెల్లజాతి నౌకర్లను వార్లర్లుగా నియమించింది. ఈ విధంగా చేసి కార్మికులు స్వేచ్చగా వదిలి వేసిన పనిని, బలవంతంగా వాళ్ల చేత చేయించడానికి ప్రభుత్వం పూనుకొన్నది. మూతబడిన గనుల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. బానిసత్వానికి, నౌకరీకి తేడా వున్నది. నౌకరు నౌకరీని వదిలివేస్తే అతడిమీద వ్యాజ్యం వేయవచ్చు. కాని బానిస గమక నౌకరీని వదిలితే అతడిచేత బలవంతంగా మళ్లీ నౌకరీ చేయించవచ్చు. ఆ ప్రకారం యిప్పుడు అట్టి కార్మికులంతా పూర్తిగా బానిసలై పోయారన్నమాట.

అంతటితో ప్రభుత్వం ఆగలేదు. కార్మికులు పౌరుషవంతులు. వాళ్లు గనుల్లో పనిచేయుటకు నిరాకరించారు. దానితో రెచ్చిపోయిన తెల్లవాళ్లు కొరడాలతో వాళ్లను కొట్టారు. ఒక్కసారిగా ఆఫీవర్లుగా మారిన తెల్లజాతి చపరాసీలు భారత కార్మికుల్ని కాళ్లతో తన్నారు. తిట్టారు. కరకాలుగా అత్యాచారాలు చేశారు. అవన్నీ ఎక్కడా లిపి అర్ధం చేయబడలేదు. యీ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని భారతీయ పేద కార్మికులు సహించారు. దుర్మార్గాన్ని గురించి ఎన్నో టెలిగ్రాములు గోఖలేగారికి పంపబడ్డాయి. ఏ రోజున వివరాలతో కూడిన తంతి అందదో, ఆరోజున గోఖలే గారే భారతావని నుంచి అడిగి తెలుసుకోనేవారు. అప్పుడు గోఖలే బాగాజుబ్బు పడ్డారు.