పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

కఠిన పరీక్ష


అరటిపండ్లు, టొమాటోలు. పచ్చి వేరుసెనగ పప్పు, నిమ్మపండ్లు, నూనె మాత్రం వాడుతూ వున్నాను. వాటిలో కుళ్లిన పదార్థం వుంటే యిక నాకు పస్తులే . కనుక డాక్టరు వాటిన్నింటిని జాగ్రత్తగా పరీక్షించేవారు. బాదం, అఖరోట్, ట్రాజిల్‌నట్‌లను కూడా తినమని సలహా యిచ్చాడు. జైల్లో నాకిచ్చిన గదిలోకి గాలిరాదు. తలుపు తీసివుంచమని డాక్టరు చెప్పినా జైలరు వినలేదు. తలుపు తెరిచి వుంచితే నా ఉద్యోగం ఊడిపోతుందని గొంతెత్తి అరిచాడు. అతడికి అటువంటి ఖైదీలు దొరికారన్నమాట. నేను మంచి కైదీనని తెలిసి నప్పటికీ, నాకు సదుపాయం కల్పిస్తే మిగతా ఖైదీలంతా నెత్తుకెక్కుతారని అతడి భయం. పాపం, ఏంచేస్తాడు? నేను జైలరునే సమర్థిస్తూ వుండేవాడిని. నాకోసం డాక్టరు, జైలరు యిద్దరూ తగదా పడటం నాకు యిష్టంలేదు. జైలరు ముక్కుకు సూటిగా పోయేమనిషి.

శ్రీకేలన్ బెక్‌ను ప్రిటోరియా జైల్లోను, శ్రీపోలక్‌ను జర్మిస్టన్ జైల్లోను వుంచారు.

ప్రభుత్వం చేసిన యీ పనులన్నీ వ్యర్థమే. ఆకాశం వూడిపడితే అతుకులు వేయడం సాధ్యమా? నేటాట్ యందు నివసిస్తున్న గిర్‌మిటియా భారతీయులు మేల్కొన్నారు. ప్రపంచ మందలి ఏ శక్తి ఇక వాళ్లను ఆపలేదు.



46

కఠిన పరీక్ష

బంగారం వన్నె తెలుసుకోవాలనుకునే వ్యాపారి లభించిన బంగారాన్ని ఒరిపిడి రాయి మీదగీచి పరీక్షించుకుంటాడు. ఇంకా ఎక్కువగా పరీక్షించాలనుకుంటే దాన్ని కుంపట్లో వేసి కాలుస్తాడు. దానితో అందలి మైల తొలగిపోతుంది. మేలిమి బంగారం లభిస్తుంది. ఇలాంటి ఒరిపిడి పరీక్షయే దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరిగింది. తెల్లప్రభుత్వం వాళ్లు నానా బాధలు పెట్టారు. కుంపట్లో వేసి కాల్చారు. ఎన్నో అగ్ని పరీక్షలకు గురి అయిన తరువాతనే వారి విలువ ఏమిటో అంతా గ్రహించారు.