పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

319


41

కార్మికుల ప్రవాహం

న్యూకేసిల్ యందలి గనుల్లో పనిచేస్తున్న భారతీయు కార్మికులపై మహిళల త్యాగప్రభావం అపరిమితంగా పడింది. తమతమ పనిముట్లన్నీ, అక్కడే వదిలివేసి నగరంవైపుకు అంతా ప్రయాణమైనారు అదొక జనప్రవాహం వెంటనే నేను ఫినిక్సు వదిలి, న్యూకేసిల్ చేరుకున్నాను

ఆ బానిస కార్మికులకు యిండ్లు అంటూ వుండవు యజమానులు యిచ్చిన కొంపల్లో వుండాలి వాళ్లే నీళ్లు యిస్తారు. లైట్లు వేసి వెలిగిస్తారు అన్ని విధాల వారు బానిసలుగా వుంటారు. తులసీదాసుకవి చెప్పినట్లు “పరాధీనులై యుండు భానిసలకు స్వప్నంలో కూడా సుఖం కలుగదు".

ఈ కార్మికులు యజమాన్లపై చేసే ఆరోపణలు అన్నీ యిన్నీ కావు వాళ్లవన్నీ పెద్ద కన్నీటి కష్టగాధలే సయ్యద్ ఇబ్రహీం అను పఠాను తన వీపు చూపించాడు. ఆయన వీపంతా చిట్లి పోయింది చూడండి ఎలా కొట్టారో. నీమాట వింటున్నానని కొట్టారు. నేను పఠానును. ఇతరుల్ని కొట్టడమేగాని కొట్టించుకోవడం ఎరుగని పఠాను కాని నీ మాట ప్రకారం భరించాను. నీకోసం పని వదిలి వచ్చేశాను" అని అన్నాడు .

“సోదరా! మంచిపని చేశావు ఇదే నిజమైన శౌర్యం . మీ వంటి వారిశక్తి సామర్ధ్యాలే మన విజయానికి సాధనాలు" అని జవాబిచ్చాను.

పైకి ధన్యవాదాలు సమర్పించానే కానీ లోలోన బాధపడ్డాను. కార్మికుల సమ్మె యిలా అయితే ఎక్కువ కాలం సాగదని అనిపించింది. ధన, మాన, ప్రాణాలన్నీ యజమాన్ల చేతుల్లో వుంటే యీ కార్మికులు ఎక్కువ కాలం ఎలా నిలబడి వుంటారు? మధ్యలో అలిసిపోయి వెనుకంజ వేయడం కంటే ఉద్యమం విరమించి ఓటమిని అంగీకరించి వీళ్లంతా తిరిగి తమ పనులు ప్రారంభిస్తే మంచిదని అనిపించింది. కాని నా మాట వాళ్లు వింటారా? వినరు. అట్టి స్థితిలో ఏం చేయాలి? యజమాన్ల కొంపల్ని వదిలివేయడమే ఉత్తమ మార్గం. అంటే హిజరత్ చేయాలన్నమాట.