పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

317


వహించి కూర్చోదు" అని ఉద్ఘాటించారు. నిజంగా స్త్రీలు చేసిన త్యాగం సామాన్యమా? వాళ్లనందరినీ నేటాల్ రాజధాని మెరిత్స్‌బర్గ్ జైల్లో వుంచారు. అక్కడ వారిని అమితంగా కష్టపెట్టారు. వాళ్ల ఆహారాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. చాకలి పనిచేయమని వారిని ఆదేశించారు. శిక్షాకాలం పూర్తి కానంతవరకు బయటినుంచి భోజనం తెప్పించుకోకూడదని ఆంక్ష విధించారు

ఒక సోదరి వ్రతరీత్యా ప్రత్యే కఆహారం తీసుకుంటుంది. ఎంతో ప్రయత్నం చేసిన తరువాత అట్టి ఆహారం అందచేయడానికి అధికారులు అంగీకరించారే కాని ఆ ఆహారాన్ని తినడం కష్టమైపోయి ఆమె ఆహారం మానుకోవలసి వచ్చింది. ఆమెకు నూనె అవసరం. తన డబ్బుతో తెప్పించుకుంటానంటే అధికారులు అంగీకరించలేదు. విడుదల అయినప్పుడు అస్థిపంజరంమై పోయింది. ఎంతో శ్రమ పడిన తరువాత ఆమె కోలుకున్నది.

మరొక సోదరి ప్రాణాంతకమైన జ్వరంతో బైటపడింది. ఈ జ్వరంవల్ల జైలునుంచి విడుదల అయిన కొద్ది రోజులకే ఆమె పరమ పదించింది. (22 ఫిబ్రవరి 1914) ఆమెను నేను ఎలా మరిచిపోతాను? ఆమె పేరు వలియమ్మ ఆమెకు 18 సంవత్సరాల వయస్సు, ఆమెను చూడ్డానికి వెళ్లినప్పుడు ఆమె రోగగ్రస్తురాలై మంచం మీదపడి వున్నది. బాగా పొడుగు. అందువల్ల కృశించిన ఆమెశరీరం భయంకరంగా వున్నది.

“వలియమ్మా! జైలుకు వెళ్లినందుకు పశ్చాత్తాపంగా వున్నాదా?" అని అడిగాను.

“పశ్చాత్తాపమా? లేదు. నన్ను అరెస్టు చేస్తే మళ్లీ జైలుకు వెళతాను" అని జవాబిచ్చింది.

“ప్రాణానికి ముప్పువస్తే?"

“రానీయండి , దేశంకోసం చావవలసి వస్తే మంచిదే గదా?" ఇదీ ఆమె సమాధానం

ఆ తరువాత కొద్ది రోజులకు అమె చనిపోయింది. ఆమె శరీరం లేదు కాని ఆమె పేరు చిరస్థాయిగా చరిత్రలోని నిలిచిపోయింది. ఆమె గతించిన తరువాత అనేకచోట్ల సంతాప సభలు జరిగాయి. వాలియమ్మ హాలు నిర్మాణం చేయాలని ఒక సభలో తీర్మానించారు. కాని ఆ ధర్మం భారత జాతి