పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

283


సూచనలున్న పుస్తకాలు సేకరించారు. అన్ని పాములూ విషపూరితాలు కావనీ, వ్యవసాయంలో సాయపడే పాములు కూడా వుంటాయని వారు చదివి తెలుసుకున్నారు. పాములను గుర్తించే విధానాన్ని మేమే వారికి నేర్పాము. చివరికి మా క్షేత్రంలోనే దొరికిన కొండ చిలువను వారు పెంచుకున్నారు. కెలన్ బెక్ దానికి తన చేతితో ఆహారం తినిపించేవారు. ఇదంతా చూసి నేను వారితో ఓసారి - స్నేహభావంతో మీరు కొండ చిలువను పెంచుతున్నారు కానీ దానికి ఆ విషయం అర్థం కాదుగదా! మీ యీ ప్రేమతో పాటు భయం మిళితమై వుంది. ఈ కొండ చిలువను స్వేచ్చగా వదిలేసి కూడా దాని పట్ల ప్రేమ చూపించటం మీకూ నాకూ కూడా సాధ్యం కాని విషయం. మనం మనలో పెంపొందించుకోవాలనుకునే భావన కూడా యీ రకపు దైర్యమే.

అందువల్ల యీ కొండచిలువను మీరు పెంచుకోవటంలో సుహృద్భావాన్ని చూడగలను కానీ అహింసను కాదు. ఈ పాముకూడా మనం వ్యవహరించేతీరును గమనించగలగాలి. భూమిపై పుట్టిన ప్రతిప్రాణీ భయాన్నీ, ప్రేమను కూడా అర్థం చేసుకోగలవు. ఇది మన పాత అనుభవమే. ఇంతేకాక యీ కొండ చిలువను విషపూరితమని మీరు ఒప్పుకోరు. దీని జీవన విధానం అలవాట్లను గురించి అధ్యయనం చేసేందుకు దీనిని మీరు ఖైదు చేసి వుంచారు. ఇది ఓ రకమైన స్వార్థం స్నేహంతో దీనికి స్థానం వుండదు. అని అన్నాను.

నా వాదనను బెక్ అర్థం చేసుకున్నా వెంటనే దాన్ని వదిలి పెట్టేందుకు వారి మనసు అంగీకరించలేదు. ఏరకమైన ఒత్తిడిని వారిపై నేను తీసుకురాలేదు. కొండచిలువ విషయంలో నేనూ పిల్లలు సైతం ఆనందానుభూతి పొందే వాళ్లం. దాన్ని ఏడిపించటం లేదా కలవర పెట్టడం వారికో ఆట. కానీ అది ఆ పంజరాన్నుంచి బైటపడే మార్గం కోసం ప్రయత్నించసాగింది. పంజరం తలుపు ఎవరి పొరపాటువల్లనైనా తెరుచుకుందో లేక కొండ చిలువే స్వయంగా ఏదో రీతిగా దాని తలుపు తెరిచిందో తెలియదు. కానీ రెండు మూడు రోజుల్లో బెక్ తన ఖైదీ మిత్రుని కలిసేందుకు వెళ్ళి వచ్చిన తరువాత చూస్తే పంజరం ఖాళీగా వుంది. ఆయనా యిది చూచి ఆనందించారు.