పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


యిప్పుడు అందించే ధైర్యం నాకు లేదు. ఇది నా అజ్ఞానం కావచ్చు. నాకీ ప్రయోగంలో చాలా చేదు అనుభవాలు కలిగాయి. కొంత నష్టపోవలసి వచ్చింది కూడా. నేను ఎవరినైతే నిర్దోషులని తలచానో వారే దోషులుగా నిరూపించబడ్డారు. కొన్ని వికారాలను కనుగొన్నాను. అందువల్ల యీ విషయంలో నేను పిరికివాణ్ణయ్యాను.

నా యీ ప్రయోగం పట్ల నాకే విధమైన పశ్చాత్తాపమూ కలుగలేదు. ఈ ప్రయోగం కారణంగా నష్టపోవలసి వచ్చిందనటానికి నా ఆత్మ అంగీకరించదు. కానీ వేడిపాల వల్ల నోరు కాలినప్పుడు మీగడను సైతం వూదుకుని తినాల్సి వస్తుందికదా! అదే నా విషయంలో జరిగింది,

మనిషి, శ్రద్ధ సాహసాలను యితరుల నుంచి దొంగిలించలేడు. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో నా శ్రద్ద సాహసాలు పరాకాష్ఠ నందుకున్నాయి. మళ్ళీ వాటిని నాకందివ్వమని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ నా ప్రార్థనను అతను ఆలకించేదెలా? అతని ముందు నాలాంటి బికార్లు అసంఖ్యాకంగా నిలబడివున్నారు. అసంఖ్యాకమైన బికారులకు మల్లే అతనికి అసంఖ్యాకమైన చెవులున్నాయి. అందువల్లే భగవంతునిపట్ల నాకు శ్రద్ధ పూర్తిగా వుంది. నేను యోగ్యుణ్ణి అయినపుడు నా ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడన్న నమ్మకమూ వుంది.

నా ప్రయోగం యిలా సాగింది.

అల్లరి చిల్లరగా తిరిగే మగపిల్లలను ఈడొచ్చిన మంచి అమ్మాయిలనూ ఒకేసారి ఒకే చోట స్నానం చేసేందుకు నేను పంపేవాణ్ణి. మగపిల్లలకు మర్యాద ఆత్మ సంయమనం గురించి మంచి బోధలు చేస్తుండేవాడిని వారంతా నా సత్యాగ్రహం గురించి ఎరిగిన వారే. వారి పట్ల నాకు మాతృ వాత్సల్యం వుండేది. ఆ పిల్లలు కూడా యిలాగే అనుకునేవారు. వంటయింటికి దూరంగా వున్న చెడువు గురించి పాఠకులకు గుర్తుండే వుంటుంది. అక్కడ ఆడపిల్లలు. మగపిల్లలు కలిసే అవకాశం యివ్వటమూ పైగా వారు నిర్దోషులుగా వుండాలని ఆశపడటం. అయితే ఒక తల్లి చూపులు తన కుమార్తె చుట్టూతా తిరుగుతున్నట్లుగా నా కళ్ళు కూడా వాళ్ళను