పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


రావచ్చు. ఇలాంటివారే చట్టాన్ని వ్యతిరేకిస్తారు. అనేక విధాలుగా తమని తాము రక్షించుకోవాలని ప్రయత్నిస్తారు. వారికి విరుద్ధంగా తీర్పులు వుంటాయి జప్తులు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి అనుచితమైన ఆసహ్యకరమైన సంఘటనలు రెండోసారి జరగవని గ్యారంటీ ఏమిటి? అందుకే మీకు నా సలహా ఒక్కటే మనముందున్న సమస్యను ధైర్యంగా శాంతితో పరిష్కరించుకునే ప్రయత్నం చేచ్చాం మళ్ళీ పోరాటం మొదలెట్టాల్సివస్తే మనమేం చేయాలో ఆలోచిద్దాం అంటే యితరులు ఏం చేస్తారో అని ఆలోచిస్తూ కూర్చోకుండా సత్యాగ్రహంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ నేనేం చేయాలి? నేనేమి చేయగలను అని ఆత్మ ఏమర్శ చేసుకోవాలి. మనం సత్యనిష్ఠతో వుంటే ఎదుటివారూ అలాగే వుండగలవనిమనలో బలహీనత ప్రవేశిస్తే వారిలోను ఆ బలహీనత ప్రవేశిస్తుందని నా భావం

మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలను గురించి తమ సందేహాన్ని కుండబద్దలు కొట్టినట్లు బయట పెట్టిన వారికీపాటికి విషయం తెలిసిపోయే వుంటుందనుకుంటాను. ఈ సందర్భంగా కాఛలియాసేర్ తమ బలాన్ని ప్రకటించడం మొదలెట్టారు. ప్రతిప్రశ్నకు తక్కువ మాటల్లో తమ విశ్వాసాన్ని తెలియజెప్పటమే కాక, తమ మాటపై గట్టిగా నిలబడి వుండేవారు. వారు తమ బలహీనతను బైటపెట్టి అంతిమ పరిణామం విషయంలో సందేహం ప్రకటించిన ఉదంతం ఒక్కటి కూడా నాకు గుర్తు లేదు. ఒక సారి యూసుఫ్‌మియా తుఫాను రేగిన సముద్రంలో దేశాన్ని ముందుకు నడిపించే కర్ణధారునిగా వుండేందుకు నిరాకరించాడు. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా కాఛలియాను తమ కర్ణుధారునిగా ఎన్నుకున్నారు. అప్పటినుంచి యుద్ధ సమాప్తి వరకు చుక్కానిపైనుంచి ఆయన చేయి తొలగించలేదు ఇతరులెవ్వరూ భరించలేని కష్టాలను సైతం నిశ్చింతగా నిర్భయంగా ఆయన సహించారు యుద్ధం కొనసాగే కొద్దీ బైట వుండి అన్ని విషయాలనూ సూక్ష్మాతిసూక్ష్మంగా పరిశీలించటం, ఏర్పాట్లు చేయటం రకరకాల మనుషులను ఒప్పించి వాళ్లతో వ్యవహరించటం కంటే, జైల్లో వుండటమే కొంతమందికి సులభమనిపించింది