పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

భూగోళము

వెలిశాయి. యిప్పుడు అక్కడ విశాలమైన భవనాలే భవనాలు. అక్కడి ధనవంతులు బాగా డబ్బు ఖర్చుచేసి దేశ దేశాలనుంచి మొక్క ఒకటింటికి 15 రూపాయల చొప్పున అనేకమొక్కలు తెప్పించి నాటారు. గత చరిత్ర తెలియని వాళ్లు అక్కడకు వెళ్లితే ఆ చెట్లు శతాబ్దాలనుంచి అక్కడ వున్నాయని అనిపిస్తుంది.

దక్షిణాఫ్రికా భూభాగాలన్నింటిని గురించి యిక్కడ వ్రాయతలచలేదు. విషయానికి సంబంధించిన ప్రదేశాలను గురించి మాత్రం వ్రాస్తాను. దక్షిణాఫ్రికాలో రెండు ప్రభుత్వాల వాళ్లు వున్నారు. 1 బ్రిటిష్ వాళ్లు 2 పోర్చుగీజులు. పోర్చుగీజుల భాగాన్ని డెలాగోవానే అని అంటారు. భారతదేశాన్నుంచి వెళ్లే ఓడలకు మొదటి హార్బరు అదే. అక్కడి నుంచి దక్షిణ దిక్కుకు ముందుకు వెళ్లితే బ్రిటిష్ వారి ప్రాంతం నేటాల్ వస్తుంది. అక్కడి హార్బరును పోర్ట్ నేటాల్ అని అంటారు. అయితే మనం దాన్ని డర్బన్ అని అంటాం, దక్షిణాఫ్రికాలో కూడా దాన్ని డర్బన్ అని అంటారు. అది నేటాల్ దేశమందలి పెద్ద నగరం. పీటర్ మెరిత్స్ బర్గ్ నేటాలుకు రాజధానీ నగరం. అది డర్బనుకు 60 మైళ్ల దూరాన, సముద్రం మట్టం నుంచి సుమారు రెండు వేల అడుగుల ఎత్తున వున్నది. డర్బన్ శీతోష్ణస్థితి దరిదాపుగా బొంబాయి నగరపు శీతోష్ణస్థితిని పోలి వుంటుంది. బొంబాయి కంటే అక్కడి గాలిలో చల్లదనం అధికంగా వుంటుంది. నేటాలును వదిలి యింకా పైకి వెళ్లితే ట్రాన్స్‌వాల్ వస్తుంది. ట్రాన్స్‌వాల్ భూభాగం యిప్పుడు ప్రపంచానికంతటికి అత్యధికంగా బంగారం అందజేస్తున్నది. కొద్ది ఏండ్లకు పూర్వం అక్కడ వజ్రాల గనులు కూడా దొరికాయి. అక్కడ ఒక గనియందు అతిపెద్ద వజ్రం ఒకటి దొరికింది. ప్రపంచంలో కెల్లా అది పెద్దదైన యీ వజ్రం పేరు ఆ గని యజమాని పేరట క్లీనన్ అని పెట్టారు. యీ వజ్రం బరువు 3000 కేరెట్లు వున్నది కోహినూర్ వజ్రం బరువు 100 కేరెట్లే. రష్యా కిరీటమందలి ఆర్లెఫ్ వజ్రం బరువు 200 కేరెట్లు.

జోహాన్స్‌బర్గ్ బంగారు నగరమే బంగారు గనులు కూడా దానికి సమీపంలోనే వున్నాయి. అయినా అది ట్రాన్స్‌వాలుకు రాజధాని కాదు.