పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం


ఆధారంతో సిమండ్స్ మమ్ము వెతికి పట్టుకున్నాడు. శక్త్యాను సారం సాయం చేస్తానని మాట యిచ్చాడు. "చపరాసీ పని యిచ్చినా చేస్తాను వ్రాత పని అవసరమైతే నావంటి నిపుణుడు మీకు దొరకడం దుర్లభం పిలవగానే వచ్చి వాల్తాను ' అని చెప్పాడు. మాకు పైరెండు పనులు చేయగల వ్యక్తి అవసరం ఈ ఆంగ్లయువకుడు రాత్రింబవళ్లు మాకోసం కష్టపడి పనిచేశాడని చెప్పగలను రాత్రి పన్నిండు లేక ఒంటిగంటవరకు టైపురైటరు దగ్గర కూర్చొని టైపు చేస్తూ వుండేవాడు. సందేశాలు చేరవేయడమే కాక ఉత్తరాలు పోస్టు చేసే పనికూడా తానే నవ్వుతూ చేస్తూ వుండేవాడు. అతడికి నెలకు 45 పౌండ్ల ఆదాయం వుండేది ఆ డబ్బంతా స్నేహితుల కోసం ఖర్చుపెడుతూ వుండేవాడు. అప్పుడు అతడికి 30 సంవత్సరాల వయస్సు వుండి వుంటుంది. పెండ్లిచేసుకోలేదు జీవితమంతా పెండ్లి చేసుకోకుండా వుండాలనే నిర్ణయానికి అతడు వచ్చాడు శ్రమకు ఫలితంగా కొద్దిగా సొమ్ము తీసుకోమని నేను మరీ మరీ చెప్పాను కాని అతడు అంగీకరించలేదు. "నేను యీ సేవకు సొమ్ము తీసుకుంటే ధర్మచ్యుతుడనై పోతాను" అని అంటూ వుండేవాడు. నాకు బాగా జ్ఞాపకం అది చివరిరాత్రి కాగితాలు సామాన్లు సర్దుకునేసరికి రాత్రి 3 గంటలైంది సిమండ్స్ కూడా రాత్రి 3 గంటల దాకా మాతో బాటే వున్నాడు. రెండో రోజున మమ్మల్ని ఓడ ఎక్కించి మరీ వెళ్లాడు. ఈ మా వియోగం ఎంత విషాదకరమైనదో వర్ణించలేను. పరోపకారం కేవలం గోధుమ రంగు గల వారి సొత్తు మాత్రమే కాదని తెలుసుకున్నాను ఇక ప్రజల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికోసం ఒక్క ముఖ్య విషయం పేర్కొంటున్నాను ప్రతినిధి బృందానికి అయిన ఖర్చు విషయమై జాగ్రత్తగా వున్నాము సోడా తాగినా ఓచరు సంపాదించి జాగ్రత్తగా వుంచాము ప్రతి పైసకు లెక్క వ్రాశాము ఎన్నో టెలిగ్రాములు పంపాము వాటన్నిటి రశీదులు జాగ్రత్తగా వుంచాము ఆయాఖాతాలలో జ్ఞాపకం వున్నంత వరకు ఖర్చు వివరాలు వ్రాశాము చిల్లర ఖర్చులు అని వేరే ఖాతా పెట్టలేదు. సామాన్యంగా ఏమో ఖర్చులు పెట్టి, జ్ఞాపకం లేక నాలుగైదు షిల్లింగుల ఖర్చును చిల్లర ఖాతాలో వ్రాస్తూ వుంటారు. ఆపని మేము చేయలేదు