పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

125


వ్యతిరేకులు, ఇంగ్లాండులో జరిగిన మహిళా ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఓ.టింగ్ హక్కులేదు. సంఖ్యలోనే గాక శారీరక శక్తిలో సైతం వాళ్లు బలహీనులే అందువల్ల యీ రెండవ ఉదాహరణ కూడా హాస్కిన వాదనా సమర్ధనకు ఉపయోగపడింది. స్త్రీలు సాగించిన ఉద్యమంలో ఆయుధ ప్రయోగాన్ని త్యజించలేదు. స్త్రీల దళాలు కొన్ని యిళ్లు తగల బెట్టడమేగాక పురుషుల మీద దాడులకు కూడా చేశాయి. అయితే వాళ్లు ఎవరినీ చంపుటకు ప్రయత్నించినట్లు నాకు కనబడలేదు. సమయం చిక్కినప్పుడు జనాన్ని కొట్టడానికి, హింసించడానికి వాళ్లు సిద్ధపడిన మాట వాస్తవం

భారతీయుల జాతీయ ఉద్యమంలో ఎప్పుడు ఎక్కడా ఆయుధాలకు తావులేదు. ఉద్యమం తీవ్రమైన కొద్దీ కష్టాలు సహించడమే గాని భారతీయ సత్యాగ్రహులు ఎప్పుడు ఎక్కడా హింసకు దిగలేదు. శారీరిక బలాన్ని బాగా ఉపయోగించగల స్థితిలో వుండి కూడా వాళ్లు అందుకు పూనుకోలేదు అయితే భారతీయులకు ఓటింగు హక్కు లేకపోవడం వాళ్లు బలహీనులు కావడం రెండూ నిజమే అనలు సత్యాగ్రహ ఉద్యమానికి యీ రెండు విషయాలకు ఏమీ సంబంధలేదు. భారతీయులకు ఓటింగ్ హక్కు వున్నప్పటికీ, ఆయుధశక్తి వున్నప్పటికీ వారు సత్యాగ్రహమే చేసి యుండేవారు ఓటింగ్‌హక్కు వుంటే అసలు సత్యాగ్రహం చేయవలసిన అవసరమే వుండేదికాదు. భారతీయుల దగ్గర ఆయుధ శక్తియే వుండి వుంటే ప్రతిపక్షంవారు కడు జాగ్రత్తగా వ్యవహరించివుండే వారు. ఆయుధ శక్తికలిగియున్నవారు సత్యాగ్రహప్రయోగానికి సామాన్యంగా పూనుకోరు దాన్ని గమనించడం అవసరం జాతీయ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయుధాల ప్రయోగం సంభవమా, అసంభవమా అని నేను యోచించలేదు. సత్యాగ్రహం కేవలం అత్మబలమే ఆయుధాల బలానికి అనగా శారీరిక బలానికి లేక పశుబలప్రయోగానికి తావు వున్నచోట అనగా దాని ఉనికికి అవకాశం వున్నచోటు యిక ఆత్మ బలానికి తావు వుండదు. నా దృష్టిలో యీ రెండు పరస్పరం విరోధించే శక్తులు ఈ భావం సత్యాగ్రహ ఉద్యమ ఆరంభంనుంచే నా హృదయంలో పూర్తిగా నాటుకున్నది