పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

101


ఒక పక్షానికి చెందియుండక సర్వులకూ వర్తించేవిగా వుండివుంటే, అవి ఒక పక్షానికి వర్తించినవే అయినా, తక్షణం రద్దు అయి వుండేవి “మేము ఏమీ చేయలేము. క్రొత్త అసెంబ్లీ వీటిని రద్దుచేయందే మేము అప్రకారం నడుచుకోవలసిందే అని చెప్పేంచుకు అధికారులకు అవకాశం లభించి యుండేది కాదు

ఇట్టి చట్టాలు ఏషియాటిక్ విభాగం చేతికి చిక్కాయి యిక వాళ్లు కఠినంగా వాటిని అమలుచేయడం ప్రారంభించారు. వారు అంతటితో ఆగలేదు. ఆచట్టాల్లో తమకు తోచిన లొసుగుల్ని కూడా బహిరంగంగా ఎకరువెపెట్టి, అట్టివాటిని సరిచేయాలని కూడా ప్రభుత్వానికి సూచించడం ప్రారంభించారు. వాళ్ల తర్కం కూడా సబబుగానే వున్నది. ఈ చట్టాలు మంచివి కావనుకుంటే వీటిని రద్దు చేయండి మంచివి అని అనుకుంటే అందలి లొసుగుల్ని, లోపాల్ని సరిచేయండి. వారి మాటలకు అర్ధం యిదే గదా! అయితే అక్కడి మంత్రిమండలి చట్టాల్ని అమలు చేయాలని నిర్ణయించింది. బోయర్ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్‌వారికి అండగా నిలచి ప్రాణాలకు తెగించి సాయంచేశారు. అయితే యిది మూడు సంవత్సరాల పూర్వం జరిగింది కనుక పాతపడిపోయింది. ట్రాన్స్‌వాల్‌లో వున్న బ్రిటిష్ ఏజంటు భారతీయులకు అధికారాలు యివ్వాలని ఉద్ఘోషించాడు. అయితే అది పాత ప్రభుత్వంలో జరిగిన విషయం బోయర్ యుద్ధకారణాల్లో వాళ్లు భారతీయులయెడ చూపుతున్న ద్వేషభావాన్ని తొలగించడం కూడా ఒకటి అని అప్పటి అనుభవంలేని తెల్లజాతి దొరలు ప్రకటించారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం ట్రాన్స్‌వాల్‌లో ఏర్పడిన తరువాత, బోయర్ ప్రభుత్వం భారతీయులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు సరిపోవని, వాటిలో మార్పులు తెచ్చి యింకా కఠినంగా వ్యవహరించాలనీ వాళ్లు తెలుసుకున్నారన్నమాట భారతీయులు ఎప్పుడుపడితే అప్పుడు ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించి, ఎక్కడ బడితే అక్కడ వ్యాపారం చేసుకోగలిగితే, బ్రిటిష్ వ్యాపారస్థులు దెబ్బతింటారని తెల్లవాళ్లు బాగా తెలుసుకున్నారు.