Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుకు పోయే ముందు

ఆధునిక భాషాశాస్త్ర పద్ధతుల్లో తెలుగు భాషమీద పరిశోధన ప్రారంభమై ఎంతోకాలం కాలేదు. అందులో వాక్య నిర్మాణ పరిశీలన మరీ ఇటీవలిది.

తెలుగు వాక్యాన్ని నేను అర్థం చేసుకోటానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటికి ఇది ఒక మజిలీ. దాదాపు పదేళ్లనుంచి తెలుగు వాక్యం గురించి నేను చేస్తున్న పరిశీలనను నా జాతి జనులతో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. ఇందులో ఎక్కువ భాగం — ముఖ్యంగా సంశ్లిష్ట వాక్యాలనుంచి — నా ఆలోచనల ప్రతిబింబాలే. ఇందులో కొన్ని అభిప్రాయాలు అక్కడక్కడా వ్యాసాల రూపంలో అచ్చయినా ఈ పుస్తకంలోకి వచ్చేటప్పటికి కొన్ని మార్పులు జరిగినై. అవి, చేదర్థకాలను గురించి, అనుకృతిని గురించి ఈ పుస్తకంలోనే తొలిసారిగా చెప్పిన అభిప్రాయాలు చాలా ఉన్నై. ఆ అధ్యాయాల్లో చేసిన కొన్ని ప్రతిపాదనలు తెలుగు భాషా పరిమితిని దాటి ఇతర భాషలకు కూడ వర్తించగలవన్న ఆశ లేకపోలేదు. ఏ శాస్త్రం ప్రతిపాదనైనా నిల్చేది అంతకన్నా మేలైన ప్రతిపాదన వచ్చేటంతవరకే. అట్లాంటి కొత్త ప్రతిపాదలను ప్రేరేపించటమే ఈ పుస్తకానికి ప్రధాన లక్ష్యం.

విషయ ప్రతిపాదన పదునుగా ఉండాలంటే సాంకేతిక పదజాలం తప్పనిసరి అవుతుంది. అది మితిమీరితే విషయం దురవగాహమై పాఠకులకు చికాకు కలిగిస్తుంది. ఇందులో అట్లాంటి పదజాలాన్ని చాలా పరిమితం చెయ్యటానికి విశేషంగా ప్రయత్నించాను.

భాషను గురించి తెలుసుకోగోరే జిజ్ఞాసువులకు ఈ పాటికే పరిచయం అయి ఉంటయ్యన్న ఉద్దేశంతో గుప్తనిర్మాణం, వ్యక్తనిర్మాణం; గర్భివాక్యం, గర్భ వాక్యంవంటి కొన్ని మాటలను ఆక్కడక్కడా వాడాను. సూత్రాల క్రమవర్తనను ఒకటి రెండు చోట్ల ప్రస్తావించాను. ఈ మాత్రం సాంకేతికతను పాఠకులు భరించ