పుట:తెలుగు వాక్యం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

తెలుగు వాక్యం

ప్రక్రియలో ఉద్దేశ్యంగా ఉండటానికి అర్హంకాదనేది ఇక్కడ గ్రహించాల్సిన వ్యాకరణ విశేషం.

వాక్యంలో ఉద్దేశ్యంగా జరిగేది కేవలనామపదంకాదని, విశేషణాదికాలతో కూడిన నామబంధం అనీ ఈ కింది ఉదాహరణనుచూస్తే తెలుస్తుంది.

(143)

సుజాత మద్రాసులో (ఒక) జరీ అంచు పచ్చపట్టు చీరకొన్నది.
→సుజాత మద్రాసులో కొన్న జరీ అంచు పచ్చపట్టు చీర .

ఇట్లాంటి నిష్పన్న నామాలు భిన్నార్థకబోధకాలవుతై. పై వాక్యానికి రెండర్థాలున్నై. (1) సుజాత ఒక పట్టుచీరకొన్నది. అది కొన్నది మద్రాసులో (2) సుజాత కొన్ని పట్టుచీరలుకొన్నది. అందులో ఒకటి మద్రాసులో కొన్నది. (మిగతావి కంజీవరంలోనో, ధర్మవరంలోనో మరెక్కడో కాని ఉండవచ్చు.)

మూల వాక్యంలో కర్తృపదంకాని, కర్మపదంగాని ఏ అడ్డంకులు లేకుండా ఈ నామ్నీకరణలో ఉద్దేశ్యాలుకావచ్చు. కాని మిగతా విభక్తులలో అన్నిటికీ ఇట్లాంటి అవకాశం లేదు.

2.711 : తో అనే విభక్తి తెలుగులో బహుళార్థాల్లో ప్రయుక్తమవుతుంది. వాటిల్లో ప్రధానమైనది కరణార్థం. ఈ అర్థంలో నామ్నీకరణం సాధ్యం. కాని ఇతరార్థాల్లో సాధ్యం కాదు.

(144)

a. సుజాత కలంతో పరీక్ష రాసింది.
            → సుజాత పరీక్ష రాసిన కలం.
b. సుజాత శ్రద్ధతో పరీక్ష రాసింది.
            → * సుజాత పరీక్షరాసిన శ్రద్ధ.
c. సుజాత జ్వరంతో పరీక్ష రాసింది
            → * సుజాత పరీక్షరాసిన జ్వరం.

పై వాక్యాల్లో తో (a) లో కరణార్థంలోనూ, (b) లో రీత్వర్థంలోనూ, (c)లో కర్తృదేహస్థితి బోధకంగాను ఉపయోగించబడింది. కరణేతరార్థాల్లో నామ్నీకరణం నిరాకృతమయింది. .