పుట:తెలుగు వాక్యం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

ఎన్నో ఏళ్ళుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధు లందరిని ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో మరపురాని మధుర ఘట్టము కాగలదు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం నుండి తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు దాదాపు ఐదుకోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాతి స్థానం తెలుగువారిదే. బౌద్దపూర్వ యుగంనుంచి ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తూ ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు అభిమానుల ప్రతినిధులను ఒక వేదికమీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషినిగూర్చి చర్చించి, నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖంచేసి మన సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ మహాసభలు ఆర్ద్రమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగుజాతిని సమైక్యం చేయగలవనీ, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవనీ విశ్వసిస్తున్నాను.

1975 ఏప్రిల్ 12వ తేదీన, తెలుగు ఉగాది రోజున, ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాలనుంచీ, యునెస్కొవంటి అంతర్జాతీయ సంస్థలనుంచి విచ్చేసిన ప్రముఖులు ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు.