పుట:తెలుగు వాక్యం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

13

నామమే. ఈ సర్వనామం ఏకవచనమైనపుడు క్రియ ధాతురూపంలోనే ఉంటుంది. ఈ ధాతువులకు ఆదేశరూపాలుంటే ఆ రూపాలే ప్రయుక్తమవుతై. వచ్చుకు- రా, తెచ్చుకు_తే, ఇచ్చుకు- ఇయ్, చచ్చుకు- చావు, లేచుకు-లే, పోవుకు-పో- ఆదేశ రూపాలు: విధ్యర్ధక క్రియకు బహువచనంలో అండి అనే ప్రత్యయం చేరుతుంది. తెలంగాణా మాండలికాలలో న్రి, ండ్రి, ండి అనే ప్రత్యయాలుచేరతై. చెప్పుండ్రి , చెప్పున్రి, రాండ్రి, రారి అనేరూపాలు తెలంగాణా వ్యవహారంలో ఉన్నై. వ్యతిరేక వీధిలో ధాతువుకు అదంతరూపం మీద వద్దు అనే ప్రత్యయం ఉభయపురుషల లోను చేరటం సాధారణం. అయితే దీనికి బదులుగా భిన్న ప్రత్యయాలతో భిన్న రూపాలు కనిపిస్తున్నై. చెప్పకు, చెప్పగాకు, చెప్పబాకు, చెప్పబోకు, చెప్పమాకు, చెప్పమోకు, చెప్పవాకు అనే రూపాలు ఏకవచనంలో విన్పిస్తున్నాయి. వీటిమీద అండి చేరిస్తే బహువచనరూపాలు ఏర్పడతై. అన్ని క్రియలకు విధిరూపాలుండవు. ఇది ఆ క్రియల అర్థాన్నిబట్టి నిర్ణీతమవుతున్నట్లు కన్పిస్తున్నది. ఎరుగు, కొను ప్రయోగంలేని తెలుసు, డోకు వంటి కొన్ని క్రియలకు. వ్యవహారంలో విధి ప్రయోగాలు లేవు.

1.243 : క్రియలలో ఉన్న అకర్మక, సకర్మక ప్రేరణ భేదాలు వాక్య నిర్మాణంలో వ్యక్తమవుతై. అకర్మక వాక్యంలో ఉన్న కర్తృపదం, సకర్మక వాక్యంలో కర్మ అవుతుంది. కొన్ని క్రియలు సహజంగా సకర్మకాలు, కొన్ని క్రియలు ప్రత్యయాదులచేత సకర్మకాలుగా మారతై . అట్లా మారిన క్రియలకు పైన చెప్పిన సూత్రం వర్తిస్తుంది. సకర్మక క్రియలుకూడా ప్రత్యయాలవల్ల ప్రేరణ క్రియలుగా మారతై, సకర్మక వాక్యంలో ఉన్న కర్తృపదానికి ప్రేరణలో చేత అనే వర్ణకం చేరుతుంది. ఈ సంబంధాన్ని కింది వాక్యాలలో చూడవచ్చు.

(24)

a. కార్మిక నాయకుడు చనిపోయాడు.
b. గూండాలు కార్మిక నాయకుణ్ణి చంపారు.
c. యజమాని గూండాలచేత కార్మిక నాయకుణ్ణి చంపించాడు.

పై వాక్యాలలో మూడవదాంట్లో యజమాని ప్రేరకుడు. గూండాలు కర్త. కార్మిక నాయకుడు కర్మ . కార్మిక నాయకుడు అకర్మక వాక్యంలో కర్త, సకర్మ వాక్యంలో కర్మ. అయితే ఈ విభజన చాలా స్థూలదృష్టితో చేసినది. ఒక వాక్యంలో ఒకే నామపదం క్రియతో అన్వయించినపుడు దాన్ని స్థూలదృష్టితో కర్త అంటు