Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

తెలుగు వాక్యం

ప్రాధాన్యం ఉంటుందని తెలుసుకోవచ్చు. కర్తృ, కర్మపదాలు నామబంధాలే అవుతయ్యని ఇంతకు ముందే చెప్పబడింది. ఉద్దేశ్య విధేయాలకు ఈ రకమైన, నిబంధన లేదు. ఈ కింది వాక్యాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

(19)

a. వంట ఇంట్లో బొద్దింకలున్నై.
b. బొద్దింకలు వంటఇంట్లో ఉన్నాయి.

పై వాక్యాలలో ఒక దాంట్లో వంట ఇంట్లో అనేది ఉద్దేశ్యం. ఇంకొక దాంట్లో బొద్దింకలు అనేది ఉద్దేశ్యం.

ప్రాచీనుల మతం ప్రకారం వక్తకు, శ్రోతకు తెలిసింది ఉద్దేశ్యం. వక్తకు మాత్రమే తెలిసింది విధేయం. ఆధునిక పద్ధతి ఇందుకు విరుద్ధమైనది కాదు. తెలుగు వాక్యాలలో మొదట ఉద్దేశ్యం వస్తుంది. తర్వాత విధేయం వస్తుంది. కొన్ని వాక్యాలలో కర్త, ఉద్దేశ్యం ఒకటే కావచ్చు. మరికొన్ని వాక్యాలలో దీనికి భిన్నంగా వ్యత్యాసం జరగవచ్చు.

1.22 : కొన్ని వాక్యాలకు కర్తృపద నిర్ణయం కష్టం. కాని ఉద్దేశ్యపదం సులభంగా గ్రహించవచ్చు. దీనికి కారణం ఉద్దేశ్యపదం సాధారణంగా పదాదిన వస్తుంది. ఈ కింది వాక్యాలలో కర్తృపదాన్ని నిర్ణయించ లేము. మొదటిపదం ఉద్దేశ్యంగా గుర్తించటం సులభమే.

(20)

a. నాకు చలిగా ఉంది.
b. ఆమెకు భయంగా ఉంది.
c. అతనికి కష్టంగా ఉంది.
d. మాకు సంతోషంగా ఉంది.

ఈ పై వాక్యాలలో మొదటిపదం ఉద్దేశ్యం. కాని కర్మపదం ఫలానిదని చెప్పటం కష్టం. వ్యక్త నిర్మాణంలో కర్తలేదు. గుప్తనిర్మాణంలో కర్తను సూచించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించదు. ఇట్లాంటి వాక్యాలలో ఉద్దేశ్యాన్ని అనుభోక్త (experiencer) గా భావించవచ్చు. అనుభవం (experience) దేహ, మనఃస్థితి బోధకం కావటం విశేషం. మరికొన్ని వాక్యాలలో వికల్ప వాక్య పద్ధతిని బట్టి కర్తృ పదాన్ని గుర్తించవచ్చు.