Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

తెలుగు వాక్యం

సిద్ధనామాలు, విశేష్యాలనుంచి సాధించిన నామాలుఉంటై. విధేయనామాలు ఉద్దేశ్య నామాల్ని గురించి సాధారణంగా ఏదో ఒక విశేషాన్ని బోధిస్తే, ఉద్దేశ్య, విధేయ నామాలు రెండూ విశేషణపద పూర్వకమై ఉండవచ్చు. ఈ విశేషణాలలో వాటిల్లో భేదాల్ని బట్టి వాటిక్రమం ఉంటుంది. ఈ కింది వాక్యాలు క్రియారహిత వాక్యాలకు ఉదాహరణలు. ఇట్లాంటి వాటిని సమీకరణ వాక్యాలంటారు.

(1)

a. ఆయన ప్రొఫెసరుగారు,
b. ఆమె మంచి టీచరు.

విధేయనామంలో విశేషణాలున్నప్పుడు విశేషణాల తర్వాత ఉన్న నామాల్ని లోపింపజేయవచ్చు. అయితే విధేయ పదబంధం విశేషణాల్ని యథాతథంగా సహించ లేదు గనుక లోపించిన నామానికి సరిపోయే లింగ, వచన బోధక ప్రత్యయాలు చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రత్యయాలను సర్వనామ రూపాలనుంచి నిష్పన్నమైనట్లుగా భావించవచ్చు. ఈ ప్రత్యయాలకు మూలం తదర్థబోధకమైన ప్రథమ పురుష సర్వనామాలు. ఇట్లాంటి ప్రత్యయసహితమైన విశేషణాలే సాధ్యనామాలు. ఈ కింది వాక్యాలలో ఈ ప్రక్రియ చూపబడుతున్నది.


(2)

a. ఆ ప్రొఫెసరు మంచి ప్రొఫెసరు -> ఆ ప్రొఫెసరు మంచివాడు.
b. ఆ టీచరు మంచి టీచరు -> ఆ టీచరు మంచిది.
c. ఆ విద్యార్ధులు మంచి విద్యార్ధులు -> ఆ విద్యార్ధులు మంచి వాళ్ళు.
d. ఆ కుర్చీ కొత్త కుర్చీ -> ఆ కుర్చీ కొత్తది.
e. ఆ చీరలు పట్టు చీరలు -> ఆ చీరలు పట్టువి.

ఈ పైన ఉపయోగించిన వాడు, వాళ్ళు అనే ప్రత్యయాలు సర్వనామాలతో సమానం. 'ది', 'వి' ప్రత్యయాలు అది, అవి అనే సర్వనామాలనుంచి మొదటి అచ్చులోపింపగా ఏర్పడిన రూపాలు.

ఈ క్రియారహితవాక్యాలు ప్రథమ, మధ్యమ - పురుష బోధకాలుకూడా కావచ్చు. అయినపుడు విధేయనామం పురుషవచన, భేదాన్నిబట్టి తద్బోధకమైన ప్రత్యయాన్ని గ్రహిస్తుంది. సహజనామంతో బాటు సాధ్యనామంకూడా ఈ ప్రత్యయాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ కింది వాక్యాలలో ఉదాహృతం.