పుట:తెలుగు వాక్యం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

తెలుగు వాక్యం

5.12 : ఏ దృష్టితో చూసినా ఏకభాషా లక్షణ పరిశీలన అన్నిటికీ మూలం. ఇతర భాషలతో పోల్చి చూసి భాషల మధ్య భేదసామ్యాలను కనుక్కోటానికి ఈ పరిశీలన అవసరం. ఆ దృష్టితో తెలుగులో ముఖ్యమని తోచిన అంశాలు ఈ అధ్యాయంలో క్రోడీకరించబడుతున్నై. వీటిల్లో చాలావరకు ఇతర ద్రావిడ భాషల్లో కనిపించవచ్చు. మరికొన్ని ఇతరేతర భాషల్లో కూడా ఉండవచ్చు. తెలుక్కి మాత్రమే పరిమితమైనవి ఇవి అని ప్రస్తుతం నిర్ధారణ చెయ్యటం కష్టం.

5.21 : సాధారణమైన సకర్మక వాక్యంలో పదక్రమాన్ని అనుసరించి ప్రపంచ భాషలను మూడు ప్రధానమైన వర్గాలుగా విభజించవచ్చునని పరిశీలకులు గుర్తించారు. అవి : 1. క్రియాది, 2. క్రియా మధ్యమం, 3. క్రియాంత భాషలు. క్రియాపదం ప్రథమేతరంగా వచ్చే భాషల్లో కర్త తరవాతనే కర్మ ఉంటుంది. క్రియాది భాషల్లో మాత్రం కర్మ తరవాత కర్త వచ్చేభాషలు కొన్ని ఉన్నై. ద్రావిడ భాషలన్నీ క్రియాంత భాషలు. భారతీయ భాషల్లో చాలావరకు క్రియాంత. భాషలే. మేఘాలయ రాష్ట్రంలో వ్యవహరించే “ఖాసీ" క్రియా మధ్యమ భాష. హిందీని గుప్తనిర్మాణంలో క్రియా మధ్యమ భాషగా పరిగణించాలని ఒక ప్రతిపాదన ఉన్నది.

5.23 : వాక్యంలో కొన్ని విశేషాలు ఈ పదక్రమాన్ని బట్టి ఉంటై. క్రియాంత భాషలు ప్రాయికంగా పరవిహిత ప్రత్యయ భాషలు. క్రియాది భాషలు పూర్వవిహిత ప్రత్యయభాషలు. క్రియా మధ్యమభాషల్లో రెండు రకాలూ ఉన్నై క్రియాంత భాషల్లో నామవిశేషణాలు నామానికి పూర్వం, క్రియా విశేషణాలు క్రియకు పూర్వం వస్తై. కారకాల్ని సూచించే విభక్తి ప్రత్యయాలు, ప్రత్యయ తుల్యపదాలు నామపదం తరవాతనే వస్తై. టర్కిష్, జాపనీస్, జార్జియన్ భాషలు ద్రావిడ భాషల్లాగే క్రియాంత భాషలు

5.31 : తెలుగులో పదక్రమాన్ని గురించి ఇంకా కొన్ని విశేషాలు చెప్పవచ్చు. అముఖ్యకర్మ ముఖ్యకర్మకు పూర్వమే ఉంటుంది . ముఖ్యకర్మ ప్రశ్నార్థక శబ్దాలు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ క్రియను అంటిపెట్టుకునే ఉంటుంది. ప్రశ్నార్థక పదాలు క్రియకు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటై. ఉపవాక్యాలు ప్రధాన వాక్యానికి పూర్వమే ఉంటై. ఆనుకృతాంశం అనుకర్త వాక్యానికి పూర్వమే ఉంటుంది. సంఖ్యావాచక పదాలు, ఇతర పరిమాణార్థక