పుట:తెలుగు వాక్యం.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5. తెలుగు వాక్యం : కొన్ని ముఖ్య లక్షణాలు

5.11 : భాషాలక్షణ పరిశీలనలో మూడు పద్ధతులను గుర్తించొచ్చు. 1. ఏకభాషా లక్షణ పరిశీలన (Characterology) 2. బహుభాషా లక్షణ పరిశీలన (Typology) 3. సర్వభాషా లక్షణ పరిశీలన (Universals) ఒక భాషకు లభ్యమాన మవుతున్న వ్యాకరణాలను బట్టిగాని, స్వయం పరిశీలనవల్లగాని గ్రహించిన విషయాలను ఏకభాషా లక్షణాలుగా పరిశీలిస్తారు. ఒక భాషలో కనిపించే లక్షణాలు కొన్ని భాషల్లో కనిపించవచ్చు, కొన్నిట్లో కనిపించకపోవచ్చు. ఉదాహరణకు తెలుగులో స్వరసమీకరణం అనే లక్షణం ఉన్నది. ఈ లక్షణం టర్కిష్, నూపే, యావల్మనీ వంటి ఇతర భాషల్లోనూ ఉంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో లేదు. ఒక భాషకు ప్రత్యేక లక్షణం అవునా కాదా? ఆంటే ఇతర భాషలతో పోల్చి చెప్పాల్సిందే. ఒకే లక్షణం భిన్నభాషల్లో కనిపించిందంటే అది ఏకభాషా పరిమితి నతిక్రమించిందన్నమాట. అది కొన్ని భాషల్లోనే కనిపిస్తే భాషలు అనుమతించే ( లేక అవలంబించే) పద్ధతుల్లో అది ఒకటి అని గ్రహించాలి. ఇట్లాంటి కొన్ని లక్షణాల్నిబట్టి భాషలను విభజించవచ్చు. ఇది బహుభాషా లక్షణ పరిశీలన. ఒక భాషలో కనిపించే లక్షణం ఆ భాషకుగాని, కొన్ని భాషలకుగాని పరిమితం కాకపోతే దాన్ని సర్వభాషా లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలనూ పరిశీలించిన వారెవ్వరూ లేరు. సర్వభాషా లక్షణ పరిశీలన అంటే అన్ని భాషల్లోనూ ఉండటానికి వీలున్న లక్షణాల పరిశీలన అని. ఉదాహరణకు అన్ని భాషల్లోనూ వక్తనూ శ్రోతనూ సూచించే పదాలు, ఉంటయ్యని చెప్పటానికి అన్ని భాషలనూ పరిశోధించక్కర్లేదు. బహుభాషా పరిశీలనవల్ల సజాతీయ సంబంధం (genetic relationship) గాని, ప్రాంతీయ సంబంధం (areal relationship) గాని, లేని భాషల్లో పరిశీలించినంత మట్టుకు కొన్ని లక్షణాలు పునః పునరాగత మవుతుంటే వాటిని సర్వభాషా లక్షణాలుగా ప్రతిపాదించవచ్చు. ఆ ప్రతిపాదనలు ఇతర శాస్త్రప్రతిపాదనల్లాగే తరవాత పరిశీలనకు నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. ఈ పుస్తకంలో సర్వభాషా లక్షణాలుగా అనుమానించదగిన కొన్ని లక్షణాలు ప్రస్తావించబడినై . (చూ. 2.16; 3.1; 3.2; 3.31). సర్వభాషా లక్షణాలు క్రమక్రమంగా భాషా నిర్వచనంలో భాగమయిపోతై.