పుట:తెలుగు వాక్యం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

97

3.93 : కొన్ని ప్రశ్నార్థక శబ్దాలకుకూడా అని, అంటే లు ప్రయుక్త మవుతై.

(226)

a. ఎందుకని రాలేదు?
b. ఎక్కడని వెతికేది?
C. ఏమని చెప్పాడు.
d. ఎందుకంటే.... .....

ఇట్లాంటి విశేష ప్రయోగాలున్నై వీటిని కూడా అనుకరణ సంబంధులుగానే ఊహించవచ్చు.

3.94 : ఇవిగాక గణగణమని, పకపకమని మొదలైన ధ్వన్యనుకరణ ప్రయోగాలు కూడా తెలుగులో ఉన్నై. భాషేతర శబ్దాలను అనుకరించవచ్చునని ఈ శబ్దాలు నిరూపిస్తున్నై. అంతేగాక ధగధగమని, తళతళమని వంటి ప్రయోగాలు చూస్తే స్పర్శయోగ్యమైనవాటిని, గుప్పుమని- (వాసన వచ్చింది) వంటి వాటిని చూస్తే ఘ్రాణయోగ్యమైన వాటినికూడా అనుకరించవచ్చునని తెలుస్తుంది. ఇంద్రియ గ్రహణ యోగ్యమైన ప్రతిదీ అనుకరణ యోగ్యమేనని చెప్పవచ్చు. వీటిల్లో కారాగమం విశేషం. ఇదిగాక పరోక్ష విధిలో మాత్రమే ఇట్లాంటి కారాగమం వస్తుంది.

తెలుగులో అనుకరణానికి చాలా విస్తృతమైన ప్రణాళిక ఉంది. తెలుగులో అనుకరణం మీద చేసే పరిశోధనవల్ల అసలు భాషల్లో అనుకరణ, తత్వాన్ని పరిశీలించటానికి ఉపయోగిస్తుంది. భాషను గురించి భాషలో చెప్పటానికి అనుమతించే సాధనం అనుకరణ. ఈ అనుకరణము గురించి ఇతర భాషల్లో ఏమంత పరిశోధన జరిగినట్టు కనపడదు. తెలుగులో జరిగిన ఈ మాత్రం పరిశీలనైనా అందుకు పనికివస్తుంది. విశాల విశ్వాన్నే గర్భీకృతం చేసుకొనే శక్తి అనుకరణకుంది. కాబట్టి భాషను అర్థం చేసుకోటానికి అట్లాంటి పరిశీలన అవసరం.