పుట:తెలుగు వాక్యం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

95

ఈ పై వాక్యాలు కారణ కార్య వాక్యభాగాలు రెండూ ఏకకర్తృకాలు. వీటిని సంపూర్ణంగా వ్యాకరణ విరుద్ధాలని చెప్పలేంగాని వీటికన్నా పూర్వపు వాక్యాలతో పోలిస్తే ఇవి అంత సమ్మతంగా కనిపించటం లేదు.

3.846 : పై వాక్యాల్లో ఒకేకర్త రెండు వ్యాపారాలను ఒకదాని తరవాత ఒకటి నిర్వహించినట్టు చెప్పబడింది. ఏకకర్తృక నిర్వాహిత వ్యాపారాల్లో అని ప్రయోగం సమ్మతంకాదని (221) లో వాక్యాలు నిరూపిస్తున్నై. అని కి పూర్వమున్న వాక్య భాగంలో భవిష్యద్బోధక క్రియ ఉంటే ఏక కర్తృకత సమ్మతమవుతుంది. కాని నిశ్చయార్థక క్రియారూపాలు వాడటానికి వీలులేదు. కాంక్ష్యార్థంలోవచ్చే దాం, అని అనే ప్రత్యయాలతో ఉన్న క్రియారూపాలు మాత్రమే ప్రయుక్తమవుతై.

(222)

a. సోషలిజం త్వరగా తీసుకు రావాలని ప్రభుత్వంవారు పన్నులు పెంచారు.
b. పుస్తకాలు కొనుక్కుందామని బజారుకు వెళ్ళాను.

ఈ పై వాక్యాల్లో అని కి పూర్వమున్న వాక్యభాగం పూర్తిఅయిన వ్యాపారాన్ని కాని, నిశ్చితమైన భవిష్యద్వ్యాపారాన్నికాక పరవాక్యంలో భాగానికి లక్ష్యాన్ని సూచిస్తున్నది. అందువల్ల ఇది వ్యాకరణ సమ్మతమయింది.

3.847 : అని తో అనుకృతమైన వాక్యంలో ఏ క్రియఉన్నా అది మొత్తం వాక్యార్థంలో నిశ్చయార్థకంకాదు. రెండు భాగాల్లో ఒకేకర్తఉంటే, కర్త తను నిర్వహించినట్టుగా చెప్పే వాక్యంలో అనిశ్చితత్వాన్ని వ్యక్తం చెయ్యటం కుదరదు. అదే లక్ష్యార్థమయితే నిర్వాహిత వ్యాపారంకాదు గనుక కుదురుతుంది. దీన్నిబట్టి ఇంకో సంగతి చెప్పవచ్చు. అని కి పూర్వమున్న వాక్య భాగార్థం పరవాక్యంలో కర్త్రనుభోక్తలచేత భావ్యమవుతుంది. నిశ్చయార్థకం సత్యమనీ, భావ్యమైనది సత్యం కానక్కరల్లేదని వ్యవహర్త అనుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. అందువల్ల ఒకే కర్త తను నిర్వహించిన పూర్వవ్యాపారాన్ని గురించి అనిశ్చితంగా ఉండటం సాధ్యంకాదు. అని తో అనుకృతమైన వాక్యాలలో అనిశ్చితాంశం ఉందనటానికి ఈ కింది వాక్యాలను గమనించండి.

(223)

a. వాళ్ళన్నయ్య వచ్చాడని మా ఆవిడ గారెలు వండింది. కాని నిజానికి రాలేదు.