పుట:తెలుగు వాక్యం.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

90

తెలుగు వాక్యం


*(211)

నాకు మా ఆవిడ సినిమాకు వెళ్దాం అని ఉంది.

అని ప్రయోగించిన వాక్యాలన్నిటినీ విశ్లేషణాలుగా చేసి వాక్యవిషయాన్ని సూచించే నామాలముందు ప్రయోగించవచ్చు. అను ధాతునిష్పన్నమైన అన్న, అనే అనే విశేషణ రూపాలు అనుబంధాలుగా చేరి వాక్యాన్ని విశేషణాలుగా మారుస్తై. వాక్య విషయాన్ని సూచించే మాటలు : విషయం, సంగతి, మాట, ప్రశ్న, సందేహం, విశేష్యాలుగా ప్రయుక్త మవుతై .

3.83 : అని తో ఉన్న వాక్యాలను అంటే చేర్చి చేదర్థకంగానూ, అన్నా చేర్చి అప్యర్థకంగానూ, అని చేర్చి క్త్వార్థ కంగానూ, అంటూ చేర్చి శత్రర్థకంగానూ ప్రయోగించవచ్చు. వాక్యానికి అని అనే అవ్యయాన్ని చేరిస్తే నామం అవుతుందని, స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇట్లా అను అనే ధాతువు చేరుతుందనటంవల్ల సాధారణంగా ధాతువు నుంచి నిష్పన్నమయ్యే వివిధ అసమాపక క్రియా రూపాలను సాధించటం ప్రయోజనం.

(212)

a. వాడు వచ్చాడంటే బుర్ర రామకీర్తన పాడిస్తాడు.
b. వాడు వస్తున్నాడంటే అందరికీ హడలు.
c. చుట్టాలు వస్తారంటే బస్తీవాళ్లు భయపడతారు.
d. తన్నానంటే మూతిపళ్లు రాలతై .
e. నేనీపని చేస్తున్నానంటే నా సొంతంకోసం కాదు.
f. నేను పాఠం చెప్పుతానంటే పిల్లలు పారిపోతారు.

పై c, f వాక్యాల్లో అంటే అనుకరణలో వచ్చిన అను ధాతు నిష్పన్నమో ? ప్రధాన క్రియగా వచ్చిన అనుదాతు నిప్పన్నమో చెప్పటం కష్టం. a, b, d, e లలో ప్రయోగించిన అంటే ని అనుకరణలో వచ్చిన అంటే గా గుర్తించవచ్చు. c, f లలో అనిఅంటే అనే రూపాన్ని ప్రయోగించవచ్చు. మిగతా వాక్యాలలో అట్లా ప్రయోగించ లేము. అనుకరణలో నుంచి c, f లను మినహాయించాలా? అనేది వెంటనే సమాధానం చెప్పటానికి వీలులేని ప్రశ్న. వీటిల్లోను మళ్ళీ a, d లలో అనుకృత వాక్యంలోని ప్రధానక్రియనే చేదర్థకంగా మార్చి వస్తే, తంతే అని వాడినా అర్ధం భేదం కనిపించటం లేదు.

కాంక్షార్థంలో అంటే ప్రయోగించి చేదర్థకం చెయ్యవచ్చు.