పుట:తెలుగు వాక్యం.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

88

తెలుగు వాక్యం

3.811 : అనుకరణగా స్పష్టంగా చెప్పటానికి వీల్లేని వాక్యాల్లో కూడా అని ప్రయోగం కనిపిస్తున్నది. అనుకృతాంశానికి నైకస్థితి ఉన్నప్పుడే అనుకరణ అంటాం. అట్లాంటప్పుడు ప్రధాన వాక్యంలో శబ్ద కర్మధాతువులుంటై. అట్లా కాకుండా ఒక విషయం భాషీకరించిన ప్రథమస్థితిలోనే అని ప్రయోగమవుతుంది. అట్లాంటిదాన్ని భాషానుకరణగా కాక విషయానుకరణగా గ్రహించాలి. దీన్నే విషయార్థక నామ్నీకరణమని పూర్వం వ్యవహరించారు. ఇందులో భౌతిక ప్రపంచంలో జరిగిన విషయాలుగాని, మనః ప్రపంచంలో సంభావ్య విషయాలు గానీ అనుకృతమవుతై. ఈ అనుకృతాంశాలు జ్ఞానార్థక క్రియలతో ప్రయుక్తమవుతై .

(206)

a. పెరిగిన ధరలు ఎప్పుడూ తగ్గవని నాకు తెలుసు.
b. విశాఖ పట్టణంలో ఉప్పు పండుతుందని నేనెరుగుదును.
c. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతయ్యని విన్నాను.

(206) c లో విను శబ్ద కర్మధాతువుగా గ్రహిస్తే ఆ వాక్యాన్ని విన్నానని, జ్ఞానార్థక ధాతువుగా గ్రహిస్తే ఆ విషయాన్ని శ్రవణేంద్రియం ద్వారా గ్రహించాను అని అర్థాలు.

3.812 : విషయార్థంలో వచ్చే నామ్నీకరణాలు విధి, ప్రశ్నార్థక వాక్యాలకు సాధ్యంకావు. నామ్నీకృత వాక్యాలు అనుకొను, ఆశించు, ఎరుగు, తెలియు, విను వంటి బుద్ధి, జ్ఞానార్థక ధాతువులు క్రియలున్న వాక్యాల్లో గర్భితాలై ఉంటై. అని తో ఉన్న వాక్యాలేవీ సాధారణ క్రియారహిత వాక్యాలతో ప్రయుక్తం కావు. కాని ఈ కింది వాక్యాల్లో ప్రయోగాల్ని గమనించండి.

(207)

a. సామ్యవాదానిదే అంతిమ విజయమని నానమ్మకం.
b. ఈ దేశం బాగుపడుతుందని నా ఆశ.
C. ఎన్నికల ద్వారా సోషలిజం రాదని కొందరి అభిప్రాయం.

ఈ పై వాక్యాల్లో నానమ్మకం, నాఆశ, కొందరి అభిప్రాయం అనే పదబంధాలు నామబంధాలే. అయితే వాటిని నేను నమ్ముతున్నాను, నేను ఆశిస్తున్నాను, కొందరు అభిప్రాయపడుతున్నారు. అనే వాక్యాలనుంచి క్రమంగా నిష్పన్నం చేయాలి. సమీకరణ వాక్యాలకూ (equational sentences) (197) లో వాక్యాలకూ భేదం స్పష్టమవుతూనే ఉంది.