పుట:తెలుగు వాక్యం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

87

అట్లాగే 202 b (iii), c (iii) వాక్యాల్లో అముఖ్య కర్మపదం వాడితే వాటి వ్యాకరణ బద్ధత సందేహాస్పద మవుతున్నది.

*(204)

a. అతను నాతో నన్ను అభ్యుదయ కవి అన్నాడు.
b. నువ్వు అతనితో అతన్ని జాతీయకవి అన్నావు.

అనుకరణంలో సమాపక క్రియగా వచ్చే అను క్రియకూ, ఈ పై వాక్యాల్లో అను క్రియకూ భేదం కనిపిస్తున్నది. ఇక్కడ మనుష్యవాచక నామాలను ముఖ్య కర్మ పదాలుగా గ్రహించగలిగిన అను ప్రయుక్తమయింది. అందువల్లే పై వాక్యాల్లో అముఖ్య కర్మపదం సరిపడటం లేదు. అట్లా వేరు చేసినప్పటికీ ఇక్కడ కర్త్రుద్ధరణను ఊహించడానికి వీలుంది. కర్త్రుద్ధరణ జరిగిన తరవాత అముఖ్య ముఖ్య కర్మపదాలు రెండూ మనుష్య వాచకాలయినప్పుడు అముఖ్య కర్మను నిత్యంగా లోపింప జెయ్యాలి. ఇక్కడ కర్తృపదం పైకి తొలగిపోయింది కాబట్టి క్రియా విభక్తి సంధాన సూత్రం వర్తించదు.

3.72 : పైన మనుష్య వాచక నామం ముఖ్య కర్మపదంగా గ్రహించ గలిగిన క్రియగా అను వివరించబడింది. మనుష్యేతర వాచక శబ్దాల్లో కూడా ఇట్లా ప్రక్రియను చూపించవచ్చు.

(205)

a. (i) నువ్వు “అది దొంగ కుక్క" అన్నావు.
   (ii) నువ్వు దాన్ని దొంగ కుక్క అన్నావు.

b. (i) నువ్వు “అది పనికి మాలిన డిగ్రీ" అన్నావు,
   (ii) నువ్వు దాన్ని పనికి మాలిన డిగ్రీ అన్నావు.

దీన్నిబట్టి కర్త్రుద్ధరణ శబ్ద కర్మేతర ధాతువు లున్నపుడే జరుగుతుందని, అను శబ్ద కర్మకంగాను, శబ్దేతర కర్మకంగానూ గుర్తించాల్సి ఉంటుందని తీర్మానించుకోవచ్చు. కేవల శబ్ద కర్మధాతువులను (ii) గుర్తులున్న వాక్యాలలో ప్రయోగించలేము. అంటే నువ్వు దాన్ని దొంగ కుక్క అని చెప్పావు, *నువ్వు దాన్ని పనికిమాలిన డిగ్రీ అని చెప్పావు అనే వాక్యాలు వ్యాకరణ సమ్మతం కాదన్నమాట. అనుకృత వాక్యాలు క్రియారహిత వాక్యాలయినప్పుడే ఈ కర్త్రుద్ధరణ కనిపిస్తున్నది. ఈ రకపు వాక్యాల్లో రెండోదళం మొదటి దళానికి విశ్లేషణ సమం కావటం ఇందుకు కారణం కావచ్చు.