Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

ముఖ్యపరిణామాలు తుల్యంగా ఉండడంవల్ల ఇవి ఏర్పడిన కాలంలో ఈ భాషలన్నీ ఒకేభాషగా ఉండేవని మనం నిర్ణయించాలి. గోండీ, కొండ, పెంగొ, మండ, కూయి, కువిలలో తెలుగులో లేని కొన్ని పరిణామాలు తుల్యంగా ఉండడం వల్ల పై మూడు పరిణామాలూ ఏర్పడిన తరవాత వీటి మూలభాష నించి మొట్టమొదట తెలుగు విడిపోయిందనీ, ఆ తరవాత కొంతకాలం పైన పేర్కొన్న భాషలు ఒకే భాషగా ఉండి మరికొన్ని పరిణామాలు పొందిన తరవాత వేరువేరు భాషలుగా విడిపోయాయనీ మనం ఊహించాలి.

     ఇక తెలుగు దక్షిణ ద్రావిడభాషలలో తుల్యంగా పొందిన పరిణామాలు రెండే రెండు ఉన్నాయి. ఆవి 1. ఇ, ఉలు అకారం ముందు ఎ, ఒలుగా మారడం (2.12), 2. పదాది చకార లోపం (2.15). తెలుగులో ఏర్పడిన మిగిలిన పరిణామాలన్నీ తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని నిరూపిస్తూ ఉండడం వలన తెలుగు ప్రత్యేక భాషగా రూపొందిన తరవాత దాని ఇరుగు పొరుగు భాషలైన తమిళం, కన్నడం మొదలైన దక్షిణ ద్రావిడభాషల సాహచర్యం వల్ల అవి పొందిన ఈ  రెండు పరిణామాలూ తెలుగు కూడా పొందిందని మనం ఊహించవచ్చు. ఇటువంటి ధ్వని పరిణామాలు ఒక భాషలో ఇరుగు పొరుగు భాషల ప్రభావం వల్ల (అవి దానికి సోదర భాషలయినా కాకపోయినా కూడా) ఏర్పడుతూ ఉండడం ప్రపంచ భాషలలో సర్వసామాన్యమే. కాబట్టి ఈ ధ్వని పరిణామాలు తెలుగుకి దక్షిణ ద్రావిడభాషలకి ఆతి సన్నిహిత నంబంధాన్ని స్థాపించడానికి ఆధారాలు కాలేవు.                                                                     
                                                                          
    పై చర్చ వల్ల తేలిన సారాంశం : మూల ద్రావిడభాష మొట్టమొదట మూల దక్షిణ ద్రావిడభాష, మూల మధ్య ద్రావిడభాష, మూలోత్తర ద్రావిడభాష అనే మూడు భాగాలుగా విడిపోయింది, ఆ కాలంలో తెలుగు మూలమధ్య ద్రావిడ భాషలో ఆంతర్లీనమై ఉండేది. మూలమధ్య ద్రావిడభాష తరవాత మూలతెలుగు - కూయి, మూల కోలామీ-పర్జి అనే రెండు భాగాలుగా విడిపోయింది. మూల తెలుగు - కూయి నించి మొట్టమొదట తెలుగు ప్రత్యేక భాషగా విడిపోయింది. తరవాత కొంతకాలం వరకూ గోండీ, కూయి మొదలైన మిగిలిన భాషలు ఒకే భాషగా ఉండి తరవాత అవి ప్రత్యేక భాషలుగా విడిపోయాయి. ద్రావిడభాషలలో ఉపకుటుంబ విభజన మీద సమగ్ర చర్చకి చూ. సుబ్రహ్మణ్యం 1977, పేజీలు 454-472).