పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు



తెలుగు పర్జీ గోండీ
చూడక చూడక సూఢ్‌ వాక్‌
రాక వెరక వాయ్‌వాక్‌
ఈ(య)క చియక సియ్‌వాక్‌
తినక తినక తిన్‌వాక్‌



     మూలద్రావిడంలో వ్యతిరేక క్త్వార్ధకం క్రియకి వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ చేర్చడం వల్లనే ఏర్పడేది. ఈ పద్ధతి ప్రాచీన తమిళంలోనూ, కోతలోనూ నిలిచి ఉంది : ఉదా. త. చెయ్యా. 'చెయ్యక', చొల్లా 'చెప్పక'. ఈ వ్యతిరేక క్త్వార్ధకం సాధారణంగా భూతకాలంలో వ్యతిరేకతని సూచిస్తుంది. కాబట్టి అన్ని దక్షిణ ద్రావిడభాషల్లోనూ దీని చివర భూత ప్రత్యయమైన తకారం చేరింది. ఊదా. త. చెయ్యాతు 'చెయ్యక' చొల్లాతు, 'చెప్పక', క. ఎన్నడె 'అనక', ఈయదె 'ఇయ్యక'. తెలుగు, పర్జీ, గోండీ ప్రత్యయాలలో అకారం మూ. ద్రా. వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ నించి వచ్చినదే; దాని తరవాత ఉన్న కకారం దక్షిణ ద్రావిడభాషల్లో తకారంలాగా భూతప్రత్యయమై ఉండవచ్చు. కకారం భూతప్రత్యయంగా మూడు ఉత్తర ద్రావిడ భాషల్లోనూ ప్రచురంగా ఉంది. తెలుగు వ్యతిరేక క్త్వార్ధకం పర్జీ, గోండీ వ్యతిరేక క్త్వార్ధక రూపాలతో సన్నిహితంగా ఉంది. కాబట్టి. తెలుగు మధ్య ద్రావిడభాష అని చెప్పడానికి ఇది ఒక ప్రబలాధారం. (చూ. కృష్టమూర్తి 1961, & 4.49., సుబ్రహ్మణ్యం 1969, & 8.) 
                                                                    
2.51. వ్యతిరేకధాతుజ విశేషణం. తెలుగులో ఇది క్రియకి-అని చేర్చడం వల్ల ఏర్పడుతుంది. మూలద్రావిడంలో వ్యతిరేకధాతుజ విశేషణం కూడా వ్యతిరేక క్త్వార్ధకానికిలాగా వ్యతిరేక ప్రత్యయమైన *-ఆ చేర్చడం వల్లనే ఏర్పడేది. ఈ పద్ధతి ప్రాచీన తమిళంలోనూ, గోండీ, కువ, కోలామీ, పర్జీ, గదబల్లో నేటికీ నిలిచి ఉంది. కాని దక్షిణ ద్రావిడ భాషల్లో తరవాత కాలంలో వ్యతిరేక ప్రత్యయం తరవాత భూతకాలిక ప్రత్యయమైన తకారమూ దాని తరవాత విశేషణ ప్రత్యయమైన అకారమూ చేరేయి. ఉదా : త. చెయ్యా, చెయ్యాత, మ. చెయ్యాత్త, క. గెయ్యద 'చేయని'. ఈ దక్షిణ ద్రావిడ రూపాలతో తెలుగు రూపాల్ని పోలిస్తే వీటిలో అకారం వ్యతిరేక ప్రత్యయమనీ దాని తరవాత నకారం భూత ప్రత్యయమని తెలుస్తుంది.