Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

2.47. క్త్వార్ధకం. తెలుగులో క్త్వార్థక ప్రత్యయం -ఇ. దీని ముందు ధాతువులో యకారం నకారంగా మారుతుంది. కాని తెలుగులో కొన్ని క్త్వార్ధక రూపాల్ని మిగిలిన మధ్య ద్రావిడభాషల్లో క్త్వార్ధకరూపాలతో పోల్చి చూస్తే ఇకారం ముందున్న సకార, చకారాలు కూడా మొదట్లో క్వ్వార్ధక ప్రత్యయానికి చెందినవే అని తెలుస్తుంది. (చూ. కృష్ణమూర్తి 1961, 4.47) 

తెలుగు గోండీ కొండ కుయి కువి పర్జీ గదబ
1. వచ్చి వాసీ వాజి వాజు వాహ వెరి వరి
2. తెచ్చి తచ్చీ తసి తస
3. ఇచ్చి సీసీ సీఅ హీహ
4. చూచి సూడ్‌సీ సుడ్ జి సూడ చూడి సూడి
5. చేసి కీసీ కిజి గిఅ
6. నిల్చి నిల్‌సీ నీల్‌జ నిల్ చి


   పై ఉదాహరణల్లో గోండీ మొదలైన భాషలన్నింటిలో సకార చకారాలు స్పష్టంగా క్త్వార్థక ప్రత్యయానికి సంబంధించినవే. తెలుగులో కూడా మొదట్లో ఇటువంటి క్రియల్లో క్త్వార్ధక ప్రత్యయం -చి/-సి. కాని ఆడి, పాడి, చెప్పి మొదలైన అనేక క్రియలలో ఇకారం మాత్రమే క్వార్ధక ప్రత్యయం కాబట్టి వీటిలో కూడా అనుచిత విభాగం వల్ల ఇకారం మాత్రమే క్త్వార్ధక ప్రత్యయంగా గ్రహించబడి చకారం క్రియలో భాగంగా కలిపివేయబడింది              
                                                                       
     కోలామీ తప్ప మిగిలిన మధ్య ద్రావిడ భాషలన్నిటిలోనూ ఇకారంతో పాటు సి/చి కూడా క్త్వార్ధక ప్రత్యయాలుగా ఉన్నాయి. కోయ తప్ప మిగిలిన గొండీ మాండలికాల్లోనూ, కొండలోనూ ఇ నశించి సి/చి ఏ అన్ని క్రియలకీ క్త్వార్ధక ప్రత్యయంగా వ్యాపించింది. ఇకారం స్పర్శంతో అంతమయ్యే క్రియల్లో క్త్వార్ధకంగా మూలద్రావిడం లోనే ఉంది. సి/చి మాత్రం మూలమధ్య ద్రావిడభాష కాలంలో మిగిలిన క్రియల్లో క్త్వార్ధకంగా సృష్టించబడింది. ఈ నూతనపరిణామం తెలుగులోనూ, కోలామీ తప్ప మిగిలిన మధ్య ద్రావిడభాషలు అన్నిటిలోనూ కనబడుతోంది. కాబట్టి తెలుగు మధ్య ద్రావిడోప కుటుంబానికి చెందినది అనడానికి ఇది ఒక ప్రబలాధారంగా మనం పరిగణించవచ్చు (చూ. సుబ్రహ్మణ్యం 1969, & 6)