పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44. తెలుగు భాషా చరిత్ర.

ప్రత్యయం ఉత్తమ పురుష బహువచనం ముందూ, మధ్యకు పురుష ఏకవచన, బహువచనాల ముందూ మాత్రమే వస్తుంది. ఉదా, అఱితుమ్‌ (తె. ఎఱుఁగుదుము). పోకతి (తె. పోవుదు (వు), కాంటిర్‌ (తె. (మీరు) కందురు). ప్రాచీన తమిళంలో ఊన్న ఇటువంటి రూపాలు తప్పితే దక్షిణ ద్రావిడ భాషల్లో పకారవకారాలే భావికాలిక ప్రత్యయాలుగా ప్రచురంగా ఊన్నాయి. కాని అన్ని మధ్య ద్రావిడ భాషలలోనూ తకార దకారాలు వర్తమాన భావికాలిక ప్రత్యయాలుగా చాలా వ్యాప్తిలో ఉన్నాయి. కాబట్టి తెలుగు మధ్య ద్రావిడభాష అనడానికి దీనిని కూడా ఒక ముఖ్యాధారంగా గ్రహించవచ్చు.

     ప్రధమ పురుషలో మహద్భహువచనం తప్ప మిగిలిన చోట్ల భావికాలిక ప్రత్యయం -ఉను. దీని తరవాత పురుష ప్రత్యయాలు లోపించి ఈ రూపం మహదమహదేకవచన, అమవాద్బహువచనాల్లో తుల్యంగా ఉంటుంది. తమిళంలో దీనికి సమమైన ప్రత్యయం -ఉమ్‌. అది కూడా (ప్రాచీన తమిళంలో మహద్బహు వచనం తప్ప మిగిలిన అన్ని లింగవచనాల్లోనూ ఉండేది. ఉదా. త, పాటుమ్‌ (తె. పాడును, నకుమ్‌ (తె. నగును, నవ్వును). త. ఉమ్‌. తె. ఉను. మూ. ద్రా. * - ఉమ్‌ నించి వచ్చినవి. మ్రాను (త. మరమ్‌), కొలను (త. కుళమ్‌) వంటి పదాల్లో ఆంత్యమకారం తెలుగులో నకారంగా మారినట్టు ఈ *-ఉమ్‌ లో మకారం కూడా నకారంగా మారింది                       
                                                                        
    2.46.వ్యతిరేక ప్రత్యయాలు. తెలుగులో -అ-వ్యతిరేక ప్రత్యయంగా అన్ని పురుష ప్రత్యయాల ముందూ ఉంటుంది. కాని తమిళం, కన్నడం మొదలైన దక్షిణ ద్రావిడభాషల్లో మాత్రం వ్యతిరేక ప్రత్యయమైన -ఆ- అమహదేకవచన బహువచనాల ముందే ఉండి, మిగిలిన పురుష ప్రత్యయాల ముందు దీని లొపరూపం ఉంటుంది. మధ్య ద్రావిడభాషల్లోనూ బ్రాహుయీలోనూ తెలుగులోలాగా వ్యతిరేక ప్రత్యయం అన్ని పురుష ప్రత్యయాల ముందూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తెలుగు మధ్య ద్రావిడభాషలతోనే సన్నిహితంగా ఉన్నట్లు తేలుతుంది. ఈ వ్యతిరేక ప్రత్యయం మూ. ద్రా. రూపం * -ఆ-. ఇది తమిళంలో దీర్ఘ ఆకారంగానే ఉండగా తెలుగులో అవదాద్యక్షరంలో దీర్ఘాచ్చు హ్రస్వమవుతుంది. (ఆరయ : త. అరాయ్‌ : ఏమఱు, త. ఏమాఱు). కాబట్టి ఇది హ్రస్వ ఆకారంగా మారింది. ఉదా. చేయదు/చెయ్యదు (త. చెయ్యాతు). (అవి) చేయవు- చెయ్యవు (త. చెయ్యా).