ఈ పుట అచ్చుదిద్దబడ్డది
33. తెలుగు భాషా చరిత్ర
కావచ్చు. 'వలన' 'వలను' 'ప్రయోజనం, దిక్కు' సప్తమ్యైకవచన రూపం. పొంటె తమిళం 'పొరుట్టు' (పొరుళ్ 'వస్తువు, ప్రయోజనం, నిమిత్తం' + తు) తో సంబంధించినది. పట్టి (త, తఱ్ఱి), కూర్చి, గుఱించు (త. కుఱిత్తు) - ఈ మూడు పట్టు (త. పఱ్ఱు), కూర్చు, గుఱించు (త. కుఱి) - ఈ క్రియల క్త్వార్థకరూపాలు. అందు లో, (త. ఉళ్, క. ఒళ్), లోపల, ప్రత్యేక శబ్దాలుగా కూడా వ్యాప్తిలో ఉన్నాయి.
2.38. అస్మదర్థక నర్వనామాలు. ఏను, నేను, మూ. ద్రా. * యాన్ నించి వచ్చినవి. ఏము, మేము, మూ. ద్రా * యామ్ నించి వచ్చినవి. (మూ, ద్రా. * యా- < తె. ఏ : చూ, - 2.8), వీటి ఔప విభక్తిక రూపాలు నన్-/నా-, మమ్-/మా- (వీటిలో మొదటిది ద్వితీయా విభక్తి ఆయిన = ఉన్ ముందు, రెండోది మిగిలిన విభక్తుల ముందు వస్తాయి). వీటి మూ. ద్రా. రూపాలు వరసగా * యన్-,. * యమ్-; ఇవి ఈ సర్వనామాల తరవాత అజాది విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ధాత్వచ్చు హ్రస్వమవడం వల్ల ఏర్పడినవి (చూ. 2.11. మూల ద్రావిడంలో పదాది యకారం తరవాత దీర్ఘ ఆకారమే గాని మరి ఏ అచ్చూ ఉండదు. కాబట్టి * యన్-, *యమ్- లలో య కారం లోపించి ఇవి మూలమధ్య ద్రావిడ భాషలో *అన్-, *అమ్- లుగా మారాయి. కోలామీ, పర్జీ, భాషలలో ఈ రూపాలు నేటికి ఇలాగే నిలిచి ఉన్నాయి. వీటికి చతుర్ధీ ప్రత్యయం -అక్కు. షష్టీ ప్రత్యయం -అ(దు) చేరగా వచ్చిన *అనక్కు, *అనదు, *అమక్కు, *అమదు అనే రూపాలు వర్ణవ్యత్యయం పొంది నాకు, నాదు, మాకు, మాదుగా మారాయి. ఈ రెండు విభక్తులలోనూ వర్ణవ్యత్యయం వల్ల సిద్ధించిన నా-, మా-, అనే రూపాలే ద్వితీయ తప్ప అన్ని విభక్తులలోనూ ప్రాతిపదికలుగా స్థిరపడ్డాయి. ద్వితీయలో అన్-, ఆమ్- ల మొదట నకార మకారాలు చేరి అవి నన్-, మమ్- లుగా మారడం నా-, మా-ల ప్రభావం వల్లనే కావచ్చు. ఇక ఏను, ఏము ప్రాచీన రూపాలనీ, నేను, మేము అర్వాచీన రూపాలనీ తులనాత్మక వ్యాకరణ దృష్ట్యానే కాకుండా నన్నయ భారతం వల్ల కూడా సృష్టమవుతుంది. నన్నయ భారతంలో ఏను, ఏము అతి ప్రచురంగా ఉండగా నేను నాలుగు చోట్ల, 'మేము' ఆరు చోట్ల మాత్రమే కనబడుతుంది. (చూ. నన్నయ పద ప్రయోగ కోశము). అలాగే నన్నెచోడుని కుమార సంభవంలో కూడా (చూ. నన్నెచోడ ప్రయోగ సూచిక) 'ఏను' చాలా చోట్ల ఉండగా 'నేను' నాలుగు చోట్ల మాత్రమే ఉంది. ఇందులో 'ఏము' అనే రూపమే