పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు

మధ్య ద్రావిడ భాషలలోనూ నిత్యమైనదిగా మారిందని చెప్పవచ్చు. ఈ మార్పు తెలుగు మధ్య ద్రావిడోపకుటుంబానికి చెందినదని నిర్ణయించడానికి ఒక ప్రబల హేతువు (చూ. సుబ్రహ్మణ్యం 1969 b).

2.36. ఔపవిభక్తికాలు. తెలుగులో -ఇ-, -టి-, -తి- ఈ మూడూ ఔప విభక్తిక ప్రత్యయాలు (బా. వ్యా, అచ్ఛిక., 28-38). -ఇ మూ. ద్రా * ఇన్‌ నించి వచ్చినది : ఊరికి (త. ఊరి- ఱ్కు < ఊర్‌ - ఇన్‌ - కు). కాలికి (త, కాలిఱ్కు < కాల్‌-ఇన్‌-కు). -టి లో ట కారం కొన్ని మాటల్లో మూ. ద్రా * ఱ్ఱ నించీ : ఏఱు. ఏటికి (త. యాఱు, యాఱ్ఱిఱ్కు), నూఱు, నూటికి (త. నూఱు, నూఱ్ఱిఱ్కు), మరికొన్ని మాటల్లో * ట్ట నించీ : కాడు, కాటికి (త. కాటు. కాటిఱ్కు), నాడు, నాటన్ (త. నాటు, నాట్టిల్ ). వచ్చినది (చూ. - 2.16).  -తి, దక్షిణ ద్రావిడభాషల్లో మకారాంత పదాలలో ఉండే -త్త్‌- ప్రత్యయానికి (త. మరం. చెట్టు : మర-త్త్‌-), గోండీలో -త్‌, -ద్‌ -లకీ, తె. చే-తి (-లో) : గోం. కయ్‌-దే (సుబ్రహ్మణ్యం 1968, -- 3, 7, 7.3.7) సంబంధించినది.      
                                                                    
2.37. ద్వితీయాది విభక్తి ప్రత్యయాలు. తెలుగులో ద్వితీయా విభక్తి ప్రత్యయం-ను-ని మూ. ద్రా. * న్‌ నించి వచ్చింది. దీని సమాన రూపాలు తమిళ, మలయాళాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఉన్నాయి. అలాగే తెలుగులో షష్టీ (చతుర్ధీ) విభక్తి ప్రత్యయం - -కు (-కి) మూ. ద్రా. * క్క్‌ నించి వచ్చింది. దీని సమాన రూపాలు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. తృతీయా విభక్తి ప్రత్యయమైన తోడన్, తోన్‌, తమిళం తృతీయా విభక్తి ప్రత్యయమైన -ఓటు/-ఒటు, -ఉటన్‌తో సంబంధించినది కావచ్చు. ఇంతకన్నా ఇది తోడు 'సహాయం' (మూ. ద్రా. * తోఱ్ - (2939) అనే శబ్దానికి సంబంధించినది అని చెప్పడం సమంజసమని తోస్తుంది.గోరన్‌, ఊరన్‌ మొదలైన పదాల్లో -ఆన్‌ (బా. వ్యా, అచ్ఛిక. 38) తమిళంలో తృతీయా విభక్తి ప్రత్యయమైన -ఆన్‌ (ప్రాచీనం)/-ఆల్‌ (ఆర్వాచీనం)కి సంబంధించినది. ఇవి తప్ప మిగిలిన ప్రత్యయాలుగా పరిగణించబడేవి అన్నీ ప్రత్యేక శబ్దాలు అనడానికి ఆధారాలు ఉన్నాయి, 'చేతన్‌' చేయి అనే పదం తృతీయా సప్తమైక్యవచన రూపం. 'కొఱకు' 'కొఱ' 'ప్రయోజనం' అనే దానికి 'కు' ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడింది. 'కయి' 'కు' ప్రత్యయానికి ఆయి (ఆగు ధాతువు క్త్వార్ధకం) చేరిస్తే ఏర్భడినది. 'కంటె' 'కన్న' - ఇవి 'కు' ప్రత్యయానికి ఆనుధాతువు నించి వచ్చిన అంటె, అన్న, చేర్చడం వల్ల ఏర్పడినవి.