పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

450 తెలుగు భాషా చరిత్ర

మర్యాద : సంస్కృతంలో మర్యాదశద్దానికి హద్దు, సరిహద్దు అనే అర్థం. నన్నయలో ఈ పదానికి నియమం, శాసనం అని అర్థముంది. “ఇది నా చేసిన మర్యాద” (ఆది. 4-272). ఈనాటి వ్యవహారంలో లక్ష్యార్థం, మన్నన అని.

15.15. సభ్యోక్తి (Euphemism) : సభలోగాని కొందరి సమక్షంలో గాని ప్రత్యక్ష౦గా వాచ్యం చేయకూడని పదాల (అశ్లీలాలు, అశుభార్థకాలు) అర్థాన్ని పరోక్ష౦గాగాని నూతనపదబంధకల్పనలవల్లగాని తెల్పేవిధానానికి సభ్యోక్తి అనిపేరు. తెలుగులో అశుభంగా భావించబడే మరణాన్ని తెలుపడానికి అనేక సభ్యోక్తులున్నాయి. కీర్తిశేషులగు, కాలమగు, కాలధర్మమగు, దివంగతులగు, శివైక్యము పొందు మొదలైనవి. అశ్లీలంగాభావింపబడే ఒంటికి, రెంటికి(ఈపదాలు కూడా మొదట సభ్యోక్తులుగా ఏర్పడినవే) తెలిపే పదాలు చాల ఉన్నాయి. వీటిలో మాండలిక భేదాలుకూడా ఎన్నోఉన్నాయి; ఉదా. దొడ్డికెళ్లు, బయటకుపోవు, కాల్వకుపోవు, చెరవుకెళ్ళు, బహిర్భూమికిపోవు, చెంబట్టకెళ్ళు, మొదలైనవి.

15.16. లోకనిరుక్తి (Folk etymology) : వ్యుత్పత్తి స్పష్టంగా నిరూపించలేని పదానికీ సామాన్యులు ఒక అర్ధాన్ని ఊహించడం, తదనుగుణంగా ఆ పదంలోని ఒకటి రెండు వర్ణాలను మార్చడం లోకనిరుక్తి లేదా జననిరుక్తి అవుతుంది. తెలుగులో లోకనిరుక్తి కి చెందిన పదాలు కొన్ని మచ్చుకు:

చందమామ : ఈ తెలుగుమాటకు సంస్కృతమూలం చంద్రమన్‌. లోక మాతయైన లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు. ఈ భావాన్ని స్ఫురించేటట్లు తెలుగు ప్రజలు చంద్రమన్‌ శబ్ధాన్ని జననిరుక్తి దృష్టిలో చందమామగా గ్రహించారు.

ఆకాశరామన్న : 'ఆకాశనామన్' శబ్దానికి తెలుగువారు కల్పించుకొన్న రూపాంతరం ఆకాశరామన్న. ఈ పదబంధంలోనికి ఆకాశ శబ్దానికి అకాశకుసుమం, అకాశ పంచాంగం ఇత్యాది పదబంధాలలాగా అభావమని అర్థం. 'ఆకాశనామన్‌' (ఆకాశనామకుడు) అనే పదానికి లోకులు కల్పించి రూఢికెక్కి౦చిన లోకనిరుక్తి రూపం ఆకాశరామన్న.

చక్రకేళి : చక్రంలా గుండ్రంగా ఉండే అరటిపండని దీనికి లోకనిరుక్తి. ఈ పదబంధంలోని చక్ర 'శర్కర' శబ్దభవమేగాని చక్ర సంబంధికాదు. కదళీ శబ్దభవము కేళి. ప్రాకృతంలోని 'సక్కరాకయళీ' తెలుగులో వర్ణవ్యత్యయంవల్ల 'చక్రకేళి' అయింది.