అర్థపరిణామం 449
15.13. అర్ధాపకర్ష(Degradation of meaning or pejoration): రూఢీలో మౌలికార్థానికి నష్టంకలిగి పరిహాసార్థంలోగాని నిందార్థంలోగాని నిమ్నార్ధంలోగాని జరిగిన అర్థపరిణామానికి అర్థాపకర్షమని పేరు ; ఉదా.
ఛా౦దసుడు : ఈ పదానికి వేదవేత్త అని మౌలికార్థం. తెలుగులో లోకజ్ఞానం లేనివాడనే నిందార్థం దీనికేర్పడింది.
సన్యాసి : ఇహలోక బంధాలను సన్యసించిన మోక్షకామి యనిమౌలికార్థం. ఎందుకు కొరగానివాడని నేటి వ్యవహరంలో కల్గిన అర్థాపకర్షం.
దేవదాసి : దేవాలయాల్లో పూజాకై౦కర్యాలలో నృత్యగానాదులకు నియమింపబడిన భక్తురాలు అని మౌళికార్థం. అర్థన్యూనతవల్ల ఇది వేశ్యకు పర్యాయపదమైంది.
కళావంతులు : నృత్యసంగీతాది కళలను అభ్యసించే స్త్రీలు అని అర్థంగల ఈ పదానికి ఈనాడు 'బోగంవాళ్ళు' అని అర్థచ్యుతి ఏర్పడింది.
కై౦కర్యం : సేవ, పూజ అనే అర్థంగల ఈ పదానికి అపహరించు, దొ౦గలించు అనే అర్ధాపకర్ష వ్యవహారంలో ఉంది.
15.14. లక్ష్యార్థసిద్ధి (Transfer of meaning): భాషలో సాధారణంగా అనేక పదాలకు ఆధారాధేయ కార్యకారణం, అంగాంగి, ఏకదేశాది సంబంధంవల్ల లక్ష్యార్థాలు ఏర్పడి రూఢికెక్కడం సహజం, తెలుగులో లక్ష్యార్ధసిద్ధి పొందిన పదాలు చాలా ఉన్నాయి; ఉదా.
ముష్టి : పిడికిలి అని దీని అర్ధం. పిడికిట్లో ఆధేయమైన బియ్యానికిది వాచ్యమై బిచ్చమనే లక్ష్యార్థాన్ని ఇస్తోంది.
దాహం : దహించుట, తపించుట అనే అర్థముండే ఈ పదానికీ కారణకార్య సంబంధంవల్ల దప్పి, పానీయమనే అర్థం ఏర్పడింది.
సూది : సూచికావాచియైన ఈ పదం సాదృశ్యాన్ని బట్టి డాక్టర్లు మందును శరీరంలోకి ఎక్కించడానికి ఉపయోగించే సూదివంటి పరికరానికి పేరుగా అర్థపరిణామం గల్గింది.
(29)