Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థ పరిణామం 445

జవాను (< ఉర్దూ : పర్షి. జవాన్‌ యువకుడు). నౌకరు, బంట్రోతు అని మాత్రమే తెలుగులో అర్థం.

జాబు (< ఉర్దూ; పర్షి. జవాబ్ సమాధానము). లేఖ, ఉత్తరం అని తెలుగులో అర్థం.

జరూరు (< ఉర్దూ; అర. జరూర్‌ : ఆవశ్యకం, తప్పనిసరి). తొందరగా, వేగంగా.

దమ్ము (ఈ ఉర్దూ: పర్షి. దమ్‌ శ్వాసం, గాలి, క్షణకాలం). తెలుగులో ఊపిరి అనే అర్థంతోపాటు (దమ్ముపట్టు) బహువచన ప్రత్యయం చేరిన దమ్ములు అనే రూపానికి ధైర్యం సాహసం అనే అర్థాలున్నాయి.

దుబారా (< ఉర్దూ దుబారా; పర్షి. దుభారహ్‌ రెండోమారు). తెలుగులో వ్యర్థంగా లేదా అధికంగా చేసే ఖర్చు అని మాత్రమే అర్థం.

దావా (< ఉర్దూ. దావా; పర్షి. దవీ వ్యాజ్యం, వాదం, గర్వం) దావా చేయు, కోర్టులో ఫిర్యాదువేయు.

నమాజు ( < ఉర్దూ, పర్షి. నమాజ్‌. ప్రార్దన) మహమ్మదీయులు చేసే ప్రార్థన.

ఫౌజు (< ఉర్దూ; పర్షి. ఫౌజ్‌, గుంపు; బృందం) సైన్యం.

బాకీ ( < ఉర్దూ; అర, బాకీ శేషం. మిగిలింది) తెలుగులో దీనికి అప్పు, ఋణం అనే అర్థాలు కూడా ఉన్నాయి.

మామూలు (< ఉర్దూ; అర, మామూల్‌ సహజం. ప్రత్యేకతలేని, విశిష్టం కాని), విశేష్యార్థంలో (ఏక, మామూలు, బహు మామూళ్ళు) ఉద్యోగులకు చిన్న మొత్తాలుగా ఇచ్చే లంచం అని అర్థపరిణామం

ముల్కీ (< ఉర్దూ ; పర్షి. ముల్కీ స్వదేశస్థుడు) పాతనైజాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

మేజువాణీ (< పర్షి. మేజ్‌ బానీ ఆతిథ్యం, అతిథ్యమివ్వటం). వినోదం, వినోద కార్యక్రమం.