Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థ పరిణామం 435

కొంతవరకు పొంది భిన్నభాషలుగా పరిణమించడం చారిత్రకసత్యం. ద్రావిడభాషా కుటుంబానికి చెందిన తెలుగుబాషలో అర్థపరిణామాన్ని చారిత్రక దృష్టితో పరిశీలించదలిచినప్పుడు మూలద్రావిడ భాషాపదాలకు తేలుగులో ఎట్టి అర్థవిపరిణామం ఏర్పడిందో పరిశీలించడం అవసరం. కాని తెలుగుకుమాతృకయైన మూల ద్రావిడం గ్రంథస్థమైన భాషకాదు. దాన్ని కేవలం తులనాత్మక పద్ధతివల్లనే పునర్నిర్మించుకోవలసి ఉంది. తులనాత్మక పద్ధతి మూలభాష వర్ణసమామ్నాయనిర్ణయానికి, పదాంశస్వరూపనిర్ణయానికి ఉపయోగకారియేకాని మూలభాషయొక్క సమగ్ర స్వరూపాన్ని లేదా మూలభాషా పదాంశాల అర్థాన్ని నిర్ణయించడానకి ఉపయోగకారికాదు. కాబట్టి, తెలుగుభాషలో పైతృకమైన దేశ్యపదాలలోని అర్థపరిణామాన్ని మూలభాషా పదజాలంతో పోల్చి నిరూపించడం సులభసాధ్యంకాదు.

15.6. ఒకభాషలో అదానప్రదానాలవల్ల అన్యభాషా పదజాలం ప్రవేశించినప్పుడు అన్యదేశ్యపదాల్లో శాబ్దికమైన మార్పులే కాకుండా అర్థవిభేదం కూడా స్వీకృతభాషలో కలగడం అసహజంకాదు. ఇది కూడా అర్థపరిణామమే, ఇంగ్లీషు భాషలాగా తెలుగు కూడా స్వీకృతభాష (borrowing language). మూల ద్రావిడం నుండి ప్రత్యేకభాషగా పరిణమించిన తొలిదశలోనే తెలుగుభాష సంస్కృతభాషా ప్రభావితమైంది. సంస్కృత ప్రాకృత పదాలనేకాలు నన్నయ పూర్వపు శాసనాలలో ప్రయోగింపబడి ఉన్నాయి. కావ్యభాషలోను, వ్యవహారంలోను ప్రవేశించిన తత్సమ పదాలు చాలా మూలభాషలలోని అర్థపరిణామాన్ని పొంది ఉన్నాయి. అట్టి పదాల్లో కొన్ని కింద ఉదాహరించ బడ్డాయి. (ఈ కింది తత్సమ పదాల అర్థ నిర్ణయానికి శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు ముఖ్యాధారాలు. సంస్కృతరూపం తత్సంబంధమైన మౌలికార్థం కుండలీకరణాల్లో చూపబడినాయి.)

అపరాధ౦ (< సం. అపరాధః తప్పు; నేరం) తెలుగులో తప్పు అనే అర్థంతోపాటు జుల్మానా, దండువు, ధనశిక్ష; అనే అర్థం ఈ పదానికి ఏర్పడింది. (వాడు పదిరూపాయల అపరాధం చెల్లించినాడు).

అభిమానం (<సం. అభిమానః 1, ధన బల కులాదులనలన గలుగు దర్పం, గర్వం, 2 ఆత్మగౌరవం). ఆత్మగౌరవం అనే అర్థంతో పాటు ఇష్టం, ప్రీతి, గౌరవం అనే అర్థాలు కూడా ఈ పదానికి తెలుగులో ఉన్నాయి. (నేనంటే అతనికి చాలా అభిమానం); అభిమానించు, ప్రీతితోచూచు.