ప్రకరణం 15
అర్థపరిణామం
జి.ఎన్. రెడ్డి
15.0. భాషా పరిణామం ప్రధానంగా రెండు రకాలు. అవి: (1) భాషకు బాహిరరూపమైన శబ్దస్వరూపంలోను నిర్మాణంలోనూ జరిగేమార్పు. (2) పదజా లానికి సంబంధించినట్టి అర్థంలో కలిగే మార్పు. దీన్నే అర్థపరిణామము (semantic change) అంటాం. పదస్వరూపం మారినప్పుడు అర్థంకాని, ఆర్థవిపరిణామం జరిగినప్పుడు పదస్వరూపంగాని మార్పు చెందాలనే నియమంలేదు. కాబట్టి భాషాపరి ణామంలో శబ్దార్థపరిణామాలు భిన్నా లేకాని పరస్పరాశ్రయాలు కావు. భాషలో గోచరించే పరిణామం, ముఖ్యంగా అర్థపరిణామం, ఎందుకు జరిగిందో నిరూపించ లేము కాని అది ఎలా జరిగిందో మాత్రం వివరించవచ్చు. తెలుగులో జరిగిన ఆర్థ పరిణామ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ముందు అర్థతత్త్వాన్ని గురించి కొంత గ్రహించడం అవసరం.
15.1. భాషానిర్మాణంలో శబ్దార్థసంబంధం యాదృచ్ఛికం. నిర్హేతుకం. ఒకే వస్తువును తెలపడానికి వివిధభాషా సమాజాల్లో భిన్నాలైన శాబ్దిక సంకేతాలు (పదాలు) ఉండటం, ఒకే భాషలోనే ఒక వస్తువును లేదా భావాన్ని తెలపడానికి రెండుమూడుపదా లుండటం, శబ్దార్థపరిణామం పరస్పరాశ్రయాలు కాకపోవడం మొదలైన లక్షణాలనుబట్టి శబ్దార్థాల మధ్య అవినాభావసంబంధం లేదని శబ్దార్థ సంబంధం కేవలం యాదృచ్ఛికమేనని స్పష్టమౌతుంది. ధ్వన్యనుకరణం లేదా శబ్దానుకృతి (onomatopoetic) తో ఏర్పడ్డ పదాలు (కాకి, కోకిల, మేక, ఇత్యాది) కొన్ని శబ్దార్థ సంబంధం ఉన్న పదాలుగా తోచవచ్చు. కాని ఇటువంటి పదాలు ఏ భాషలోనైనా వేళ్ళమీద లెక్కింపదగినంత మాత్రంగానే ఉంటాయి.
అర్థవేది (semanticist) ఒక భాషలోని పదాల అర్థాన్ని రెండు విధాల పరిశీలించవచ్చు. (1) వివరణాత్మక పద్ధతి: (2) చారిత్రక పద్ధతి. ఒక కాలానికి