ప్రకరణం 14
తెలుగు మాండలికాలు : ప్రమాణభాష
-- భద్రిరాజు కృష్ణమూర్తి 14. 0. ఉపోద్ఘాతం :
జీవద్భాషకు మార్పు సహజం. మార్పువల్ల భాషలో బహురూపత, వైవిధ్యం (variation) ఏర్పడతాయి. ఈ బహురూపత మూడువిధాలు : (1) చారిత్రకం. ఒక కాలంలో ఉన్న రూపాలకు కాలాంతరములో ఏర్పడ్డ తుల్యరూపాలకు మధ్య తేడాలుంటాయి. ఇప్పటి తెలుగులో 'వాడు' (ప్రథమైకవచనం) రూపానికి పూర్వపూర్వ రూపాలు 'వాఁడు<వాణ్డు<వాన్డు<*అవన్డు' అని. ఇదేవిధంగా భాషాభాగాల్లో ఎలాటి మార్పులు రావటంవల్ల ఆధునికభాష పూర్వ భాషనుంచి ఏలా పరిణమించిందో ఇంతకు ముందరి అధ్యాయాల్లో చూశారు. (2) ప్రా౦తీయం. ఒకేకాలంలో ఒక ప్రాంతంలో ఉన్న వాడుకకు మరొక ప్రాంతంలో ఉన్న వాడుకకు మధ్య సమాన శబ్దాల్లోనూ, వ్యాకరణ భాగాల్లోనూ, తేడాలుండవచ్చు ; ఉదా. వచ్చినాడు, వచ్చిండు, వచ్చాడు. ఇలాంటివి ప్రాంతీయభేదాలు. (3) సాంఘికం. సాంఘికవ్యవస్థలో ఉన్న మార్పులు - ఆర్థిక సాంస్కృతిక పరమైనవి-వ్యవహర్తమాటల్లో ప్రతిఫలిస్తాయి. ఈతేడాలను వర్గమాండలికాలంటారు, చాప/సాప, వెండి/యెండి, లేదు/నేదు, అట్టా/గట్టా మొదలైన మాటలను బట్టి వ్యవహర్త సాంఘకస్థాయిని గుర్తించవచ్చు. తరగతులనుబట్టి వచ్చే భేదాలు ఒకేకాలంలోనే ఒకే ప్రా౦తంలోనే ఉండవచ్చు.
పైన పేర్కొన్నవిగాక ఇతర హేతువులవల్ల వ్యవహార వైవిధ్యంలో అవాంతర భేదాలు ఎన్నో రకాలు ఉండవచ్చు; ఉదా. లిఖితభాష/వాడుకభాష; ఉపన్యాసభాష /సంభాషణభాష ; గృహవ్యవహారం/బహిరంగ వ్యవహారం ; అలాగే వృద్దులభాష, స్త్రీలభాష, విద్యార్థులభాష, పసిపిల్లలభాష - కొన్నిచోట్ల గుర్తించదగిన తీరుగా ఉంటాయి. తెలంగాణా విద్యార్థుల్లో 'చెమ్చా', 'లైటుగొట్టటం'1 బాగా వ్యాప్తిలో ఉన్నాయి. ఇవి ఇతరులు వాడరు. కొన్నిరకాల తిట్లు ఆడవాళ్ళ