ఆధునికభాష : సంగ్రహవర్ణనం 387
ఈ పై వాటికి వ్యతిరేకవాక్యాలు 'లే' అనే 'ఉండు' ధాతువుయొక్క అన్నంత రూపానికి క్రియావిభక్తులు చేర్చటంవల్ల ఏర్పడతాయి.
13.15. క్రియాసహితవాక్యాలు : వీటిలో మళ్ళీ కర్తృరహిత వాక్యాలు, కర్తృసహితవాక్యాలు అని రెండు రకాలు. కర్తృరహితవాక్యాల్లో 'ఉంది' అనే క్రియారూపం ఉంటుంది. దేహమనస్థితి బోధకనామాలు 'గా' అనే ప్రత్యయంతో ఈ వాక్యాల్లో ఉంటాయి. ఉదా: నాకు ఆకలిగా ఉంది. వాడికి సంతోషంగా ఉంది. ఈ పై వాక్యాలు ఈ కింది కర్తృసహిత వాక్యాలతో సమానార్థకాలు. నేను ఆకలిగా ఉన్నాను, వాడు సంతోషంగా ఉన్నాడు.
కర్తృసహితవాక్వాలను క్రియలనుబట్టి అకర్మక, సకర్మక, ప్రేరణ వాక్యాలుగా విభజించవచ్చు.
అకర్మక వాక్యాల్లో కర్మఉండదు. సకర్మకవాక్యాల్లో ఉంటుంది. ప్రేరణ వాక్యాల్లో కర్తృప్రేరక నామం ఉంటుంది. అకర్మక : అతను నిద్రపోయాడు. సకర్మక : ఆమె అన్నం వండింది. అతను అన్నం తిన్నాడు. ప్రేరణ: ఆమె అతన్ని నిద్ర పుచ్చింది. ఆమె అతనిచేత అన్నం వండించింది.
ఆ ప్రేరణంలో అకర్మక క్రియ ఉంటే దాని కర్తృపదానికి ను విభక్తి, సకర్మక క్రియ ఉంటే దాని కర్తృపదానికి చేత వర్ణకమూ వస్తాయి. అర్థభేదంలో రెంటికీ ఈ విభక్తులు రావచ్చు. ఉదా : ఆమె ఆతన్ని B.A వరకు చదివించింది. ఆమె అతన్ని ఒంటిగంటవరకు చదివించింది. ఆమె అతనిచేత ఒంటిగంటవరకు చదివించింది.
తెలుగు వాక్యంలో పదబంధాలు 'కర్తృ-కర్మ-క్రియా' క్రమంలో ఉంటాయి. క్రియావిశేషణాలు కర్తృపదం తరవాత, క్రియకుపూర్వం ఉంటాయి. ప్రాధాన్య వివక్షలో ఈ క్రమం వ్యత్యస్తం కావచ్చు. ఉదా: అతను నిన్న ఊరినుంచి వచ్చాడు, అతను ఊరినుంచి నిన్నవచ్చాడు. నిన్న ఊరినుంచి అతను వచ్చాడు.
క్రియను నామంగామార్చి వాక్యంలో ఏ క్రియేతరపదబ౦ధాన్నయినా విదేయ స్థానంలో వాడట౦ ద్వారా కూడా ప్రాధాన్య వివక్షచేయ్యవచ్చు. ఉదా: అతను ఊరినుంచి వచ్చింది నిన్న. అతను నిన్న వచ్చింది ఊరినుంచి. నిన్న ఊరినుంచి వచ్చింది అతను.