Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక భాష : సంగ్రహవర్ణనం

359

వీటిలో ఒక్క 'f' ను మినహాయిస్తే తక్కిన వర్ణాలన్నీ సంస్కృత, ప్రాకృత, హిందీవంటి ఇండో-ఆర్యన్ భాషలనుంచి వచ్చిన మాటలద్వారా తెలుగులో చేరినాయి. అవి ఆ మాటలకే పరిమితమయి ఉన్నాయికూడా. 'హ' వర్ణం కొన్ని కన్నడం నుంచి వచ్చిన మాటల్లో కూడా ఉన్నది. ఉదా. హత్తు, పొచ్చు, హొన్ను మొ. మహా ప్రాణవర్ణాలుకొన్ని తెలుగు మాటల్లో అరుదుగా కనిపిస్తున్నాయి, పది, ముప్పై, నలభై , యాభై , డెభ్భై, ఎనభై , తొంభై వంటి మాటల్లో వినిపించే మహా ప్రాణోచ్చారణకు మూలం చెప్పటం కష్టం. ఇతర భాషా ప్రభావం కారణమనటానికి ఆధారాల్లేవు.

ఖారం, ఘాలి, ధారం, భావి అనే తెలుగు మాటల్లో మహాప్రాణోచ్చారణకు కృతక ప్రామాణికత్వం కారణంగా కనిపిస్తుంది.

నేటి తెలుగువారి ఉచ్చారణలో చదువుకున్న వారిలోనై నా మహాప్రాణోచ్చా రణ తక్కువే. ఓష్ఠ్య వర్ణాల్లో వినిపించినంతగా నిరోష్ఠ్యవర్ణాల్లో వినిపించదు. ఠ , ఢ, ఛ, ఝు లు, కంఠం, శుంఠవంటి కొన్ని మాటలు మినహాయిస్తే ఎక్కువగా కావ్య భాషకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఉదా : ఠావు, ఠేవ, పరిఢవిల్లు, ఛత్రము, ఛాత్రుడు, ఝషము, ఝంకారము, మొ॥ . తెలుగులో మహాప్రాణోచ్చారణకు ఆర్థభేదక సామర్థ్యం లేదు. మహా ప్రాణోచ్చారణ నిర్దిష్టమైనశబ్దాలను అల్పప్రాణంతో ఉచ్చరించినా ఆర్థావగాహనకు ఆటంకం లేదు. వ్యవహర్తల ప్రాచ్య, ప్రాచీన విద్యాగంధాన్ని గాని, సాంస్కృతి కంగా వారి ఔన్నత్యాన్ని గాని సూచించటానికి మహాప్రాణోచ్చారణ ప్రవర్తిస్తుంది. ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పాల్సినప్పుడుకూడా మహాప్రాణోచ్చారణ ఉపయుక్త మవుతున్నది. ఉదా : వెంఠనే, ఒట్టి, ఖర్మ, సరిగ్ఘా, ఏమ్హిలేదు. స్పర్శేత రాల్లో కూడా కనిపించటంవల్ల దీన్ని హవర్ణోచ్చారణగా గ్రహించవచ్చు.

13.3. తెలుగు లిపిలో కనిపించే శ,ష,స వర్ణాల్లో చివరిదే ప్రాచీన భాష నుంచి వచ్చింది. శ, ష లు సంస్కృతం, హిందీ మాటలనుంచి ప్రవేశించాయి. ’ శ' వర్ణానికి నిర్దిష్టమైన ఉచ్చారణ తెలుగులో వినిపించటం అరుదు. నిరోష్ఠ్యాచ్చుల ముందు (ఇ, ఈ, ఎ, ఏ, అ, ఆ) ,శ, స లకు భేదం వినిపించదు. కొందరి ఉచ్చారణలోమాత్రం, ఓష్ఠ్యాచ్చులముందు వినిపిస్తుంది. ఉదా : శుభ్రం, త్రిశూలం, శోభనం.