ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇ/ ఎ, ఉ/ఒ లు మూల దక్షిణద్రావిడంలో ఎ, ఒ లుగా మారి అవి తెలుగు, కన్నడాల్లో అలాగే నిలిచి ఉండగా ప్రాచీన తమిళ, మలయాళాల్లో ఇ,ఉ లుగా మారేయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. (కృష్ణమూర్తి 1958 b.) ఈ కింద. ఇచ్చిన ఉదాహరణల్లో మూలద్రావిడంలో ఇ, ఉ లు తెలుగులో ఎ, ఒ లుగా మారేయి.
- తె. కెలఁకు : త. కిళై, కిళ్ళు 'తవ్వు' (1321)
- తె. కొఱ, కొఱఁత (క. కొఱె) : త. కుఱు, 'పొట్టి', కున్ఱు 'తగ్గు', తె. కుఱు, కుఱచు, కుందు (1537)
- తె. తొఱఁగు (క. తొఱె) : కొం. తుఱ్హ్-కూ. తుహ్ (2768)
- తె. దొరలు . త .చురి, చూర్ 'చుట్టూ తిరుగు', చురుళ్ 'చుట్టుకొను', చురుట్టు 'చుట్టు', తె చుట్ట (2211)
- తె. నెఱయు, నెరయు (క. నెఱె): తె. నిండు, గోం. నింద్, కొం. నిన్ఱ్, కు. నీంద్, నూ. నింద్ (3049)
- తె. నెల, నెలవు (క. నెలె) : త. మ. క. నిల్, తె. నిలుచు, నిల్చు, గోం. నిల్ (3048)
- తె. మొదలు (క. మొదల్) : త. ముతల్ 'మొదలు', ముతిర్ - 'ఎక్కువ అగు' (4053)
- తె. మొన (క. మొనె) : త. మున్, మున్పు, ముంతి 'ముందు', తె. మున్, మునుపు, ముందు (4119)
- తె. మొరయు (క. మొరే, మొరళ్): ప. ముర్-'అరచు', కు. ముర్ర్-'ఉరుము, భయపెట్టు' మా. ముర్-'మాట్లాడు' (4076).
- తె. వెల (క. బెలె) : త. మ. విల్ 'అమ్ము', క. బిల్, బిలి 'అమ్ము', తె. విలుచు, విల్చు, విలువ (4448).
2.13 వర్ణవ్యత్యయం. కొన్ని మూలద్రావిడధాతువులలో అచ్చూ దాని తరవాత హల్లు పరస్పరం తెలుగులో స్థానం మార్చుకొంటాయి. అంటే అవి వర్ణవ్యత్యయం పొందుతాయి (ఈ మార్పుని వర్ణవ్యత్యయమని గుర్తించి దానిని మొట్ట మొదట చర్చించినవారు కృష్ణమూర్తి 1955,247-252: 1961, pp. 1.121-59).