పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

308

తెలుగు భాషా చరిత్ర

తచ్చబ్దం సంస్కృతాన్ని మాత్రమే సూచిస్తుంది. ప్రాకృతభాషా తత్వానికి ఈ పరిభాష నూటికినూరుపాళ్ళు నప్పుతుంది. కాగా, తెలుగు లాక్షణికులు వాడిన తత్సమ తద్బవాలన్న పరిభాషలోని తచ్చబ్దం సంస్కృత ప్రాకృతాలకు మాత్రమే పరిమితార్థంలో ప్రవర్తిస్తుంది. అనంతర యుగాలలో తెలుగుతో సంసర్గ సంబంధం కల్గిన అరబ్బీ, తుర్కీ, పారసీ, మరాటి, ఉర్జూ, పోర్చుగీసు, ఇంగ్లీషు మొదలైన సంస్కృత ప్రాక్ఫతేతర భాషలనించి తెలుగుకు సజాతీయాలయిన తమిళం కన్నడంవంటి భాషలనించీ తెలుగులో ప్రవేశించిన పదజాలంపట్ల ఈ పరిభాష ప్రవర్తితం కాకపోవడమేకాక అవ్యాప్తిదోషంకూడ సంక్రమిస్తున్నది. కాబట్టి ఇంతకుముందు సూచించినట్లుగా తెలుగులోని పదజాలాన్ని దేశ్యమనీ, దేశ్యేతరమనీ వర్గీకరించడం శాస్రీయమనీ సహేతుకమనీ నిర్ణయించవచ్చు.

   భాషల సంసర్గంవల్ల రెండు పక్షాలలో ప్రవర్తితమయ్యే పరిమాణాలను వర్ణనాత్మకపద్ధతిలో నిరూపించవచ్చు. ఈ నిర్దిష్ట పరిమాణాలకు మూలమైన కారణాలనుకూడా చాలావరకు భాషావైజ్ఞానిక రీతులద్వారా నిర్ధారణ చేయవచ్చు. సంసర్గంలోని రెండు భాషలలో ప్రధానాంశాలయిన వర్ణసమామ్నాయాన్ని వ్యాకరణాన్ని పోల్చి వాటిలోని వైషమ్యాలను లక్ష్యీ కరించినట్లయితే సంసర్గంలోని ఒక నిర్ణీత సన్నివేశంలో కన్పించే ప్రచురమైన పరిమాణాలను లెక్కించవచ్చు. సంసర్గ స్వభావానుగుణమైన సాంస్కృతిక సన్నివేశాలలో కొరవడ్డ పదజాలాన్ని గూర్చి వివేచించి నై ఘంటుకాదానాల (Lexical borrowings) ను కూడ నిరూపించవచ్చు.
   సాధారణంగా తెలుగులోని తద్భవాలను నిరూపించే సందర్భంలో మాతృకలనుగూర్చి తెలుగు వ్యాకర్తలలో రెండు మతాలున్నట్లు గోచరిస్తున్నది. కేతన, విన్నకోట పెద్దన, కూచిమంచి తిమ్మన మొదలైన వారు తద్బవాలకు మాతృకగా సంస్కృతాన్ని మాత్రమే పేర్కొని, సమీపమాతృక (immediate sources) లయిన ప్రాకృతాల్ని పూర్తిగా విస్మరించారు. చింతామణి కర్త, బాల సరస్వతి, చిన్నయసూరి మొదలైన వారు సమీపమాతృకగా పాకృతాన్నికూడ పేర్కొన్నారు. తద్భవాలలో అయిదింట నాలుగువంతులు ప్రాకృతభవాలు; అయిదింట ఒకపాలు మాత్రమే సంస్కృతభవాలు కన్పిస్తున్నాయి. చిన్నయసూరినిరూపించినట్లుగా తద్బవాలను సంస్కృతభవాలనీ, ప్రాకృతభవాలనీ వేర్వేరుగా వివక్షించడం చాలా శాస్త్రీయమైన దృష్టి.