పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

306

తెలుగు భాషా చరిత్ర

ఆవశ్యకాన్నిబట్టీ, ఆయా భావాల ప్రాబల్యాన్నిబట్టీ తత్తద్పోధకాలైన నదాల వ్యవహార యోగ్యత ఏర్పడి ఉంటుంది. పరిణామ శీలమైన సమాజంలో వీటి అవసరం లేకపోతేనో, లేక సన్నగిలిపోతేనో ఇవి తదనురూపంగా చెలామణినించి తప్పుకుంటాయి. ఒక భాషలో ఒక భావాన్ని, లేక వస్తువుని సమర్థంగా ప్రకటించే పదం ఉన్నప్పటికి, ఒక్కోకాలంలోని వ్యవహర్తలు దేశ్యపదాల స్థానంలో ఇతర భాషాపదాలను వాడడంకూడాకద్దు. నూతన పదాల వాడకం సంస్కర లక్షణమనే భావన దేశీయలలో ప్రస్ఫుట మవడం దీనికి ముఖ్య కారణం. ఆర్థిక సాంఘిక రాజకీయాదుల పరంగా ఉన్నత స్థానంలోఉన్న వారి వేషభాషాదికాలను తక్కిన వారు అనుకరించ యత్నించడం అన్ని దేశకాలాలలోను అతి సాధారణ విషయం.

భాషలలోని ఈ ఆదాన ప్రదానాలకి రెండు ముఖ్యప్రేరకాలను భాషావిజ్ఞాన కోవిదులు పేర్కొంటున్నారు. మొదటిది ఆవశ్యక పూరకం (need filling motive); రెండోది ప్రతిష్టాహేతుకం (Prestige motive). పైన ఉట్టంకించిన అన్ని ఆంశాలూ ఈ రెంటిండిలో ఇమిడిపోతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఏకార్థబోధకాలైన ఎరవు మాటలూ, దేశ్యపదాలూ పక్కపక్కన వాడుకలో ఉండవచ్చు. ఉదాహరణకి ఇంగ్లీషులోని ఈ కింది జంటపదాలను పరిశీలించవచ్చు. ఈ జంటలలోని తొలిపదాలు వ్యుత్పత్తి పరంగా ఇంగ్లీషుభాషకు విసర్గాలుగా వాడుకపడ్డవి; రెండోవి ఫ్రెంచి భాషనించి ఎరవుతేబడి ఇంగ్లీషులో ప్రవృత్తి పరంగా స్థిరపడ్డవి.

   Answer-reply, body-corpse, ghost-spirit, hearty-cordial, room-chamber, ship-vessel, Spring-fountain, Yearly-annual.
   10.6. ప్రాచీనకాలంనించీ తెలుగుభాష అన్య భాషాసంసర్గం కలిగి ఉన్నట్టుగా నిర్ద్వంద్వంగా నిర్ధారించవచ్చు. తెలుగుపైగల అన్యభాషల ప్రభావాన్ని చారిత్రికకాలంనించీ మనం ప్రదర్శించవచ్చు. అనేక భాషలతో తెలుగుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాల అంతరువులలో సంబంధాలు ఉంటూనే వచ్చాయి. జాగరితమైన జాతిగా విశ్వవిజ్ఞానాన్ని తన పరిధిలోకి తెచ్చుకోవాలనే జిజ్హాసగల సమాజంగా తెలుగుభాషా సమాజం నాటికీ నేటికీ వ్యవహరిస్తూనే ఉంది. జాతి ఆశలు, ఆశయాల, ఆవశ్యకాలు పెరిగేకొద్దీ, సంకల్పవాహకమైన భాషసైతం పెరిగి