తెలుగులోని వైక్సృతపదాలు
303
సమగ్ర కథనం సాధ్యపడుతుంది. ఒక వ్యక్తికి పరభాషాసంస్కృతుల యెడగల దృష్టి, పరభాషాధ్యయనంపట్లగల శక్త్యాసక్తులూ, బహుభాషా వ్యవహర్తల సంఖ్యా, సమాజంలో వీరికిగల స్థానం, వీరి సాంఘిక నియమాలు-మొదలై న అనేకాంశాలను భాషాతీత విషయాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి విసృతమైన ప్రాతిపదికగల ఆర్థిక మానసిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంతో భాషల సంసర్గాన్నీ దాని ప్రభావాన్నీ సరిగా అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేవలం భాషావిజ్ఞానం తోడ్పాటువల్లనేగాక, అన్యోన్యాశ్రితాలైన ఇతర అనుబంధ శాస్త్రాల (related disciplines) అదనపు సాయంవల్లనే సంపూర్ణమయిన ఈ అవగాహన సాధ్యమవుతుంది. పరిమిత ప్రయోజనాలదృష్ట్యా ఈ శాస్త్రాలు వేర్వేరై నప్పటికీ, అనేక ప్రమాణాలతోకూడిన ఈ సదవగాహనను సరిగా ప్రవర్తించజేయాలంటే ఇతర శాస్త్రాలన్నింటినీ పరిపూరకాలు (Supplementary)గా ఉపయోగించుకున్నప్పుడే వీలవుతుంది. ఈ అన్ని రీతులకి చక్కని సమన్వయం సమకూర్చి పరిశీలిస్తేనే ప్రకృత సమస్యయొక్క సమ్యక్స్వరూపం బోధపడుతుంది.
10.4. భాషలసంసర్గ ప్రభావం చాల మట్టుకు ఏకపక్షవర్తిగానే ఉంటుందనడానికి ప్రపంచ భాషల చరిత్రలనించి అనేకోదాహరణాలు ఉట్టంకించవచ్చు. అరబ్బీ, గ్రీక్, చీనీ, లాటిన్, సంస్కృతం-ఈ అయిదు భాషలే ప్రపంచ సంస్కృతి వాహక సాధనాలుగా అగ్రశ్రేణి భాషలని శాస్త్రవేత్తల అభిప్రాయము. హీబ్రూ, ఫ్రెంచి భాషలు ఈ విషయంలో ద్వితీయ స్టానానీ ఆక్రమిస్తాయి. (Edward Sapir, 1921 : 194). ఇస్లాం సంస్కృతి వాహకమైన అరబ్బీభాష మధ్యప్రాచ్యంలోని తుర్కీ పారశీకాది భాషలపై నెరపిన ప్రభావం అంతాఇంతా కాదు. కాని, దీనికి మారుగా అరబ్బీభాష పూర్వోక్తభాషలనించి ఎరవు తెచ్చుకున్నది ఇంచుమించుగా ఏమీ లేదనే చెప్పాలి. నూతన వైజ్ఞానిక పరికరాలకూ, నూతనౌషధాలకూ, వాటి నిర్మాణ ప్రక్రియలకూ నామకల్పన చెయ్యడంలో గ్రీకు లాటిన్ భాషల ప్రాధాన్యం నానాటికీ పెరుగుతూనే ఉండడం మనం ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉన్నాం (Sapir, 1921:194; Earnst Klein Etymological Dictionary of English Language, Vol. I. Introduction, pp. X-XII). చీనాభాష శతాబ్దుల తరబడిగా జపానీ, కొరియన్, అన్నామైట్ భాషలను తన పదజాలంతో ముంచెత్తింది. చీనీ భాషాపదం లేకుండా జపానీ భాషలో ఒక్క వాక్యమైనా రచించడం దుస్సాధం అని పరిశీలకులంటారు. అయితే దీనికి బదులుగా ఈ భాషలనించి చీనీ