Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

301

   అయితే కొన్ని భాషలు ఇతర భాషాపదాలను అతివేలంగా ఎరవు తెచ్చుకుంటాయి; కొన్ని పరిమితంగా ఎరువు తెచ్చుకుంటాయి: కొన్ని అనూదితాదానాలు. (loan transaction) గా స్వీకరిస్తారు. పరభాషలపట్ల దేశీయులు చిత్తవృత్తులు పరిపరి విధాలుగా ప్రవర్తితమవుతుంటాయి. పరభావ సహిష్ణుత, పరభాషా సంస్కృతుల యెడలగల ఆసక్తి, పరభాషాధ్యయన నిరతి, స్వీయ భాషలలోని భావ ప్రకటన శక్తి నూతనభావ ప్రకటనావశ్యకం-ఇత్యాద్యనేక హేతువులపై ఎరవుపదాల రాకడ, వాటి నిలకడ ఆధారపడి ఉంటాయి. ఎరవు మాటలను స్వీకరించడం భాషాసాంకర్యమని భావించే 'స్వస్థానవేషభాషా' ప్రియులు దీనికొప్పుకోక నిరోధించినప్పటికీ, పరభాషాపదాల రాకడనుగాని, వాటి ప్రచుర ప్రవృత్తినిగానీ సంవూర్ణ౦గా నివారించడం సులభసాధ్యమైన పని కాదు.
   10.1. ద్విభాషా వ్యవహారానికిగాని, బహుభాషా వ్యవహారానికిగాని విభిన్నభాషల సంసర్గమే మూలకారణ౦. రెండు సమాజాల సమ్మేళనంలో సంస్కృతి ప్రసారణం (Cultural diffusion) ప్రవర్తితమవుతూ ఉంటుంది. భాషా సంసర్గం ఈ సాంస్కృతిక సంబంధాలలో ఒకటి. దీని ఫలితాలలో ప్రముఖమయినవి భాషలలోని పరస్పర ప్రభావ వినిమయాలు, స౦ప్రదాయ సిద్ధ నిర్మాణానికి విరుద్ధ లక్షణాలుకన్పిస్తే దాన్ని ఆదానం అనవచ్చు (Bloomfield, 1933), ఒక భాషలోని ఏ నిర్మాణ భాగమైనా ఇతర భాషలవల్ల ప్రభావితమయితే దాన్ని సైతం ఎరవు తెచ్చిందనవచ్చు (R.A. Hall, 1964). ఒకటో రెండో కొత్త అంశాలు అదనంగా చేరడమేకాక అనాదిగా వస్తున్న కొన్నింటికి ఉద్వాసన చెప్పడమో, లేక కొద్ది మార్పులతో వ్యవహరించడమో సంస్కృతి పరిణామ క్రమంలో సహజంగా జరిగే విషయాలు. భాషలలోని ఈ ఆదాన ప్రదానానికి ద్విభాషా వ్యవహర్తలను మూలంగా పేర్కోవచ్చు. ద్విభాషా వ్యవహారాన్నే ద్విభాషాస్థితి (bilingualism) అని అనవచ్చు. సమీపవర్తిభాషలకు సంసర్గం అతిసహజం. రాజకీయంగా సాంస్కృతికంగా ఉన్నతస్థానంలో ఉన్న భాష దూరవర్తిగా ఉన్నప్పటికీ అ భాషా ప్రభావం ఇతర భాషలమీద పడితీరుతుంది. సంసర్గంలోని ప్రకృష్ణభాష (upper or dominant language) సామాన్యంగా విజేతలదో విశిష్టులదో అయిఉంటుంది. కొన్ని కొన్ని వేళలలో విజితులభాష సాంస్కృతికంగా పైచేయిగా ఉంటే అది విజేతల భాషనుకూడా కొంతలో కొంత ప్రభావితంచేస్తుంది.