ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రకరణం 10
తెలుగులోని వైకృత పదాలు
---తూమాటి దొణప్ప
10.0. భాషా విషయంగా ఏ మానవ సమాజానికి కూడా స్వయం సమృద్దతా; స్వయం సంపూర్ణతా అసంభవం. ప్రపంచంలోని అన్ని భాషలూ అన్యోన్యాశ్రయాలుగా పెంపొందుతాయన్నది చారిత్రక సత్యం. స్వచ్చమైన జాతి అన్నది ఎలా అరుదో, అలాగే పరభాషాస్పర్శకు లోనుగాని స్వచ్చమైన భాష అన్నది కూడా చాలా అరుదు. కొద్దో గొప్పో ప్రతిభాషమీద పరభాషల ప్రభావం తప్పని సరిగా ఉంటుంది. అందువల్ల ఏభాషలోనయినా పదజాలము(vocabulary) దేశ్య (indigenous) మనీ, దేశ్యేతర (non-indigenous) మనీ రెండు రకాలుగా ప్రవర్తితమవుతూ ఉంటుంది. మూల మాతృకనించి నిసర్గంగా-అంటే పైతృకంగా సంక్రమించిన పదజాలం దేశ్య భాగమని (Basic core vocabulary or inherited vocabulary) నిర్ధారించవచ్చు. ఆ యా భాషల చారిత్రక వికాసదశలలో సమీపవర్తి సజాతీయ భాషలనించిగాని, పరిసరస్థ విజాతీయ భాషలనించిగాని, మత సాంఘిక వాణిజ్య రాజకీయ సాంస్కృతికాది సంబంధాల మూలంగా దూరవర్తిభాషల నించిగాని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చిచేరిన పదసముదాయాన్ని (acquired vocabulary) దేశ్ళేతర భాగమని నిర్జేశంచవచ్చు. ఈ రెండు విధాలయిన పద జాలంవల్ల భాష సుసంపన్నమై తత్తత్కాలోచితంగా వ్యవహర్తల భావ ప్రకటనావశ్యకాలను నిర్వహించ సమర్ధమవుతూ ఉంటుంది. అన్ని భాషలకూ వర్తించే సర్వవ్యాపక సుత్రమిది. తెలుగు భాషగాని మరొక బాషగాని దీనికి అపవాదంకాదు. విశ్వవిజ్ఞానాన్ని తమ సంస్క్రుతిలో ఇముడ్చుకోవాలనే తెలుగు వాళ్ళ జ్ఞానపిపాసకు నిదర్శనంగా ఎన్నెన్నో భాషలనించి భిన్నభిన్నయుగాలలో వేలాది పదాలు తెలుగులోకి ఎరువు తీసుకోబడ్డాయి.