పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రాంథిక వ్యావహారిక వాదాలు 287

శాశ్వతంగా స్థిరీకరించే ప్రయత్నం మన పూర్వులుకూడా చెయ్యలేదనీ, ఆయా కాలాల్లోని శిష్టవ్యవహారాన్ని ఆధారంచేసుకొని వ్యాకరణ సూత్రాలను సరిదిద్ధటం ఏ భాషా సాహిత్యంలోనైనా అనూచానంగా వస్తున్న సంప్రదాయమనీ, అమంగళాశ్లీలాదులే గ్రామ్య౦కాని శిష్టవ్యవహారం ఎప్పుడూ గ్రామ్యంకాదనీ అనేకోపపత్తులలో గిడుగువారు, తాతా సుభ్భారాయుడుశాస్త్రీగారు మొదలైన విద్వాంసులు నిరూపిస్తూ వచ్చారు. అయితే స౦ప్రదాయవాదులు వ్యావహారికరూపాలను అన్యదేశ్యాలను నిఘంటు బద్ధం చేయటానికి మాత్రం అంగీకరించి ఆ పదాలను రచనల్లో వాడటం నిషేధించదలిచారు.6 వ్యాకరణ ప్రయోజనంమాట అటుంచి భాషలో మార్పేరాదని, లిఖితభాషకు ఉచ్చరితభాషకూ భేదమేలేదని కొందరు వాదించారు.7 మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారు 'భారతభాషకును నేటి గ్రా౦థికభాషకును భేదము' (సారస్వతవ్యాసములు, రెండవ సంపుటము, పే. 64-75) అనే వ్యాసంలో 'ఎవ్వనియేని ముఖామృతాంశుబింబమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబు', “పరాశరసుతుం బ్రణమిల్లి', 'ఈఁగాంచితి', 'పంచత్వము', 'సనియెడుమని', 'ఇది వడిగలదు', 'నాకుం గరుణి౦పుండని', 'తనకు సురగభోజనంబు సురపతిచేతంబడసి', 'బ్రహ్మకుం దపము సేసి', 'అక్కన్యను మ్రోక్కించి' మొదలైన నన్నయ ప్రయోగాలను తరవాతి కాలంలోని గ్రా౦థికరూపాలతో పోల్చిచూచి మరి మాట్లాడమన్నారు. దృష్టిభేదం ఉండవచ్చుగాని దృష్టిలోపం ఉంటే చేయగలిగింది లేదు. 1912 మే లో మద్రాసులో జరిగిన పండితసభలో పాల్గొన్న పెద్దలు మాటలో రాతలో తెలుగులో భేదమేలేదు కాబట్టి ఏలాటి సంస్కరణమూ అక్కరలేదని వాదించారట ! అదేనిజమయితే, శిష్టులు మాట్లాడేవిధంగా రాయటానికి అభ్యంతరం ఎందుకో అర్థంకాదు.8 ప్రాచీనవ్యాకరణసూత్రాలు వేదప్రమాణాలని భావించి మార్పును వ్యతిరేకించినా కాలప్రవాహమూ భాషాప్రవాహమూ ఆగేవికావు; వాటిని ఆపటం ఎవరితరమూ కాదు.9 'శిష్టానా ముక్తౌ సూత్రాణా మభావే అనుశాసనకారిణ ఏవ దండనీయాః' అన్న దండిసూక్తిని స్మరించటం మంచిది. ఏవో తాతలనాటి సూత్రాలనే వల్లించటంకన్నా 'కేవలం శాస్త్రమాశ్రిత్యనకర్తవ్యో వినిర్ణయః, యుక్తిహీన విచారే తు ధర్మహానిః ప్రజాయతే' అన్న అభియుక్తోక్తిని అర్థంచేసుకోవటం మంచిది. తొలి రోజుల్లో గ్రా౦థికవాదు లాక్షేపించినట్లు ఇప్పుడు వ్యావహారిక సాహిత్యలోపం లేదు.10 ఆధునిక పరిస్థితుల్లో వ్యావహారికంవినా మరో మార్గాంత రమూ లేదు.11 పూర్వకవులు మాత్రమే భాషాస్వరూపనిర్ణేతలనే దురభిప్రాయం ఎంత త్వరలో పోతే అంత మంచిది.12