ఆధునికయుగం : గ్రాంథికవ్యావహారికవాదాలు 273
'బాలవ్యాకరణము' రచించి రాజధానికళాశాలలో ప్రధానాంధ్రాధ్యాపకులయిన తరవాత పరిస్థితులు తలక్రిందుగా మారేయి. ఆంగ్లభాషాసంప్రదాయాలతో పరిచయ మేర్పడ్డ కారణంగా తెలిగువారికి కలిగిన మరోలాభం పత్రికాప్రచురణ. మొదట తెలుగు పత్రిక 'వర్తమాన తరంగిణి' లోనూ, రెండోది 'సుజన రంజని' (సూరి సంపాదకుడుగా 1845 లో వెలిసింది) లోనూ, తరవాత తరవాత గ్రాంథిక భాషకే స్థానం కలిగినా తొలిరోజుల్లో వ్యావహారికమే ఉండేది. సామినేని ముద్దు నరసింహంనాయుడుగారు 1840 లో రాయగా ఆయన మరణానంతరం 1862 ప్రచురితమైన 'హితసూచని' పీఠికలో ఆనాటి అభ్యుదయగామి పండితుల దృక్పథం తెలియవస్తుంది. సిద్ధాంతచర్చ చేసి అర్దానుస్వార శకటరేఫలను వర్ణించాలని చెప్పిన వారిలో ఆయనే ప్రథముడు. 1897 లో వెలుగుచూసిన గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కము' ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన మొట్ట మొదటి మహాగ్రంథం.
9.9. అటు సాహిత్యంలోనూ పెద్దమార్పువచ్చింది. సంఘ సంస్కరణతో బాటు భాషా సాహిత్య సంస్కారాన్ని తలపెట్టిన కందుకూరి వీరేశలింగంగారు (1848-1919) విభిన్న సాహితీశాస్త్ర ప్రక్రియలను 'సరళ గ్రా౦థిక' భాషలో (1880) వెలువరించటం ఆరంభించారు. క్షీణయుగ సాహిత్యప్రక్రియల్లో భాషలోనూ రచనలోనూ కనిపించే సాము గారిడీలకు ఆయన స్వస్తి చెప్పేరు. ఇటు కన్యా శుల్క మార్గం అతినూతనమైన భాషాభావవిప్లవం రేకెత్తించింది. కావ్యభాష వ్యవహారభాష కెప్పుడూ దూరంగా ఉంటుండేదని, సంప్రదాయ పండితులు తమనాటి వ్యవహారభాషను మరచిపోతుండేవారని, పాశ్చత్యవిద్వాంసులు చేసినవాదం కొందరినై నా ఆకర్షించటం మొదలయింది- ఇరవయ్యో శతాబ్దానికి ముందుగానే1 . ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం గిడుగు వెంకటరామమూర్తి గారు సవర భాషకు 1892 లో రచించిన నిఘంటు వ్యాకరణాలు. ఆయేడే టి. ఎమ్. శేషగిరి శాస్త్రిగారి 'ఆర్థానుస్వారతత్వము' కొంతకు కొంత భాషాశాస్త్రధోరణిలో వెలువడింది. ఆనాటికి ఆంగ్లదేశంలోనే అధునాతన మనిపించిన 'ప్రత్యక్షపద్ధతి (Direct Method) లో విద్యాబోధన చేయటాన్ని తెలుగుదేశ౦లో ప్రవేశ పెట్టిన గిడుగు రామమూర్తి గారు విజ్ఞాన సముపార్జనకు పురాతనకావ్యభాషకాక ఆధునాతన శిష్టవ్యావహారిక మే చాలా మంచిదని గ్రహించి ప్రచార మారంభించారు.
(18)