పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునిక యుగం : గ్రాంథికవ్యావహారికవాదాలు 271

వాటిలో మొదటిది. నాయకరాజుల కాలంలోనూ ఆ తరవాతా ఈ రకం గ్రంథాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీటిలో లక్షణవిరుద్ధభాషకు స్థానం దొరికింది. మహాకావ్యాలకు, లక్షణగ్రంథాలకు, పండితులు రాసిన టీకావ్యాఖ్యానాల్లో శాస్త్ర రచనల్లో క్రమంగా వ్యావహారికానికి తావు లభిస్తూ వచ్చింది. శాసనాల్లోను, తాటేకు పుస్తకాల్లోను మొదటినుంచీ వ్యావహారికరూపాలు పూర్తిగాను, కొంతకు కొంతగాను ఉంటుండేవి. కావ్యరచన చాలావరకు గతానుగతిక మైన ప్రబంధ ధోరణిలోను, కొరవకు ద్వ్యర్థిత్ర్యర్థి కావ్యాలవంటి చిత్రవిస్తరాది కవితాఫక్కికల్లోను సాగుతుండేది. తెలుగుభాషా సాహిత్యాలు ఈ స్థితిలో ఉండగా ఆంగ్ల పభుత్వం ఏర్పడిన తరవాత కొంత భావపరివర్తనం వచ్చింది.

9.6. ఆంగ్ల ప్రభుత్వం ధర్మమా అని తెలుగువారికి లభించిన ముఖ్య సహాయం ముద్రణ సౌకర్యం, క్రీ. శ. 1720 నుంచి వ్యావహారికంలో ఉన్న క్రైస్తవ వాఙ్యయం తెలుగులో రావటం మొదలయింది (ని. వెంకటరావు, 1954, పే. 68). 1746 నుంచి అలాటి గ్రంథాలు సంఖ్యాధికంగా వస్తూండేవి (అదే. పే. 69). 1806 లో మద్రాసులో తెలుగు ముద్రణాలయం నెలకొన్నప్పటినుంచీ దేశభాషా గ్రంథ ప్రచురణ మూడుపూలు ఆరుకాయలుగా వర్జిల్లింది (రమణారెడ్డి. 1969, పే. 23). 1802 నుంచి ప్రభుత్వ ప్రకటనలు తెలుగులో వస్తుండేవి (రామమూర్తి, 1958, పే. 13). 1813 లో బ్రిటిష్‌ పార్లమెంటు 'చర్చి మిషనరీ సౌసైటి'ని స్థాపించాలని దేశభాషల్లో విద్యాబోధన జరపాలని, సంకల్పించి 'ఛార్టర్‌ ఆక్ట్‌' పాస్ చేసింది (రమణారెడ్డి 1969, పే. 21), తత్ఫలితంగా మద్రాసులోని 'సెయింట్‌. జార్జ్‌కోటలో ఆయేడే ఒక కళాశాల స్థాపించారు. అందులో పట్టాభిరామశాస్త్రిగారు సంస్కృతా౦ధ్రశాఖలకు ప్రధానులుగానూ, రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు ఉదయగిరి వెంకట నారాయణయ్యగారు అధ్యాపకులుగానూ ఉండేవారు. దీంతో కులమత విచక్షణ లేకుండా కోరిన వారందరికి విద్యాసౌకర్యాలు ఏర్పట్టమే కాకుండా ఆంగ్లభాషా, తద్వారా విశ్వసాహితీ విశేషాలూ తెలుగు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. 1829 లో మద్రాసు మచిలీపట్టణాల్లో ఇంగ్లీషు (బోధన మాధ్యంగా) పాఠశాలలు ఏర్పడ్డాయి. 1841 లో మద్రాసులో ఉన్నత పాఠశాల నెలకొన్నది. మద్రాసులోనే 1855 లో రాజధాని కళాకాల, 1857 లో విశ్వవిద్యాలయమూ ఏర్పడ్డాయి. ఆధునికవిద్యార్దుల ఉపయోగార్థం ప్రాచీనగ్రంథాలను ముద్రించవలసివచ్చింది. దాంతో 'పరిష్కర్త' లేర్పడి పూర్వకవిప్రయోగాలను దిద్దటం మొదలుపెట్టేరు. ముద్రణ సౌకర్యాలవల్ల వచ్చిపడ్డ దౌర్భాగ్యం ఇదొకటి.